Emotional Regulation: మనకి ఎమోషనల్ కంట్రోల్ అవసరం బాసూ
ఇంటర్నెట్ డెస్క్: పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదన్న బాధతో కొందరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. చిన్న చిన్న విషయాలకే ఆవేశంతో ఊగిపోతూ రక్తపోటు తెచ్చుకునేవారు మరికొందరు. ప్రియమైన వ్యక్తుల నుంచి ఏదో ఆశించి, అది జరగకపోయేసరికి అసంతృప్తికి గురవుతుంటారు ఇంకొంతమంది. ప్రతి మనిషిలో సంతోషం, కోపం, బాధ, భయం, ఆత్రుత ఇలా అనేక భావోద్వేగాలుంటాయి. వాటిని సరైన సమయంలో, సరైన మోతాదులో ప్రదర్శిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ, అవి నియంత్రణ లేకుండా బయటకొచ్చినప్పుడే మనిషి విచక్షణ కోల్పోతాడు. దీంతో ఆలోచనలు, చర్యలు, మానవ సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే, భావోద్వేగాలపై నియంత్రణ అవసరమని మానసిక నిపుణులు చెబుతున్నారు.
కోపం వస్తే వెంటనే కోప్పడతాం. ఎవరైనా కోప్పడితే దాని గురించి ఆలోచిస్తూ ఏడ్చేస్తాం. ఏదైనా మనకు నచ్చని విషయం జరిగినప్పుడు బాధ పడతాం. ఇలా ప్రతి భావోద్వేగాన్ని ప్రదర్శించడం సహజం. కానీ, ప్రస్తుత కాలంలో మనుషులకు సహనం ఉండట్లేదు. భావోద్వేగాలను అవసరమైన దానికన్నా ఎక్కువగా చూపిస్తున్నారు. దీంతో పర్యవసానాలు ప్రతికూలంగా మారుతున్నాయి. అందుకే, ఇప్పుడు ఎమోషనల్ రెగ్యులేషన్(భావోద్వేగాల నియంత్రణ) అనే పదం వెల్‌నెస్ బజ్ వర్డ్‌గా మారింది. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అతిగా స్పందించకుండా, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడకుండా చూసుకోవడమే ఎమోషనల్ రెగ్యులేషన్. దీని అవసరంపై ప్రస్తుతం సోషల్‌మీడియా వేదికగా చర్చలు జరుగుతున్నాయి.
నియంత్రించకపోతే?
భావోద్వేగాలతో సమస్యలు రావు. వాటిని ప్రదర్శించే తీరుతోనే సమస్యలు వస్తాయి. నియంత్రణ లేనప్పుడు క్షణికావేశంలో దారుణాలు చోటుచేసుకుంటాయి. కొన్నిసార్లు ఆత్మహత్యలు, హత్యలు జరుగుతాయి. మరికొన్ని సందర్భాల్లో ఎవరైనా ఒక మాట అంటే, దాని గురించే ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటారు. కోపం వచ్చినప్పుడు ఏమీ ఆలోచించకుండా తిట్టేస్తారు. ఆ తర్వాత పశ్చాత్తాపం చెందుతారు. ఎవరైనా చెప్పింది చేయనప్పుడు మాట్లాడటం మానేస్తారు. ఆవేశంతో ఉన్నప్పుడు అతిగా తినడం, నిద్రించడం, సోషల్‌మీడియాలో గంటలతరబడి మునిగిపోవడం, గతంలో జరిగిన ఘటనల ప్రస్తావన తీసుకొచ్చి వాదించడం వంటివి జరుగుతుంటాయి. వీటివల్ల జీర్ణక్రియలో సమస్యలు, నిద్రలేమి, రక్తపోటు, గుండెపోటు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి.
నియంత్రించడం ఎలా?
- మీరు భావోద్వేగానికి గురైనప్పుడు దాన్ని ఒక నోట్‌బుక్‌లో రాయండి. నాకు కోపం వస్తుంది/ కష్టంగా అనిపిస్తుంది/ బాధేస్తుంది/ భయంగా ఉంది/ విసుగ్గా అనిపిస్తుంది ఇలా మీ భావానికి ఒక పేరు పెట్టడం వల్ల దాని తీవ్రత చాలావరకు తగ్గుతుంది.
- నేరుగా అయినా, మెసేజ్ రూపంలో అయినా ఎవరైనా ఏదైనా అంటే వెంటనే స్పందించొద్దు. కొద్దిసేపు ఆగండి. ఉన్నతంగా ఆలోచించడానికి 10 నిమిషాలు, గంట లేదా ఒక రోజు సమయం తీసుకున్నా ఫర్వాలేదు. ఎందుకంటే, వారు అనే మాటలకు వెంటనే స్పందించడం వల్ల అనర్థాలు జరుగుతాయి. తర్వాత పశ్చాత్తాపం చెందాల్సి వస్తుంది.
- భావోద్వేగాలు తీవ్రమైనప్పుడు వెంటనే నీరు తాగడం, కొద్దిసేపు వాకింగ్ చేయడం, ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోవడం, దీర్ఘంగా శ్వాస తీసుకొని వదలడం వంటివి చేసి శరీరాన్ని నియంత్రించుకోవాలి. దీనివల్ల భావోద్వేగాలను నియంత్రించుకోవడం సులభమవుతుంది.
- అన్నింటికి పరిధులు పెట్టుకోండి. వాదనలతో సమయం వృథా చేయకండి.
- ఇతరులు మీ భావోద్వేగాలను నియంత్రిస్తారని భావించొద్దు. మీ పరిస్థితిని భాగస్వామి, తల్లిదండ్రులు, స్నేహితులు, ఇతరులు అర్థం చేసుకుంటారు అంతే. నియంత్రించుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది.
నియంత్రణతో లాభాలు
భావోద్వేగాలను నియంత్రించుకోవడం వల్ల మానసిక ఆందోళన ఉండదు. ఎలాంటి పరిస్థితినైనా ఎంతో ఓర్పుగా ఎదుర్కోగలుగుతారు. స్థిరమైన ప్రశాంతత లభిస్తుంది. ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. బాధ పెట్టే విషయాలు మిమ్మల్ని, మీ సమయాన్ని ప్రభావితం చేయవు. మనసు, శరీరం ఉల్లాసంగా ఉంటుంది.
