జమ్మూ కశ్మీర్ ఉధంపూర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదుల కదలికలు భద్రతా దళాలను అప్రమత్తం చేశాయి. ఉధంపూర్ జిల్లాలో బుధవారం (ఫిబ్రవరి 4) జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా దళాలు–ఉగ్రవాదుల మధ్య జరిగిన భీకర ఎదురు కాల్పులు కొంతసేపు ఉద్రిక్తతకు దారితీశాయి.
ఉధంపూర్ జిల్లా మజల్టా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం అందడంతో సైన్యం, భద్రతా బలగాలు వెంటనే కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించాయి. అనుమానాస్పద ప్రాంతాన్ని చుట్టుముట్టిన దళాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాల కదలికలను గమనించిన ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డారు.
దీంతో అప్రమత్తమైన సైనికులు తక్షణమే కౌంటర్ ఫైరింగ్‌కు దిగారు. కొంతసేపు ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగగా, చివరకు భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు అక్కడికక్కడే హతమయ్యారు. మృతులను పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు జబ్బర్, మావిగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీగా ఆయుధాలు, గోలీలు లభ్యమైనట్లు ప్రాథమిక సమాచారం. భద్రతా కారణాల దృష్ట్యా పరిసర ప్రాంతాల్లో ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారా అనే కోణంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. స్థానిక ప్రజలను అప్రమత్తం చేస్తూ, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని భద్రతా వర్గాలు స్పష్టం చేశాయి.
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేయాలనే లక్ష్యంతో భద్రతా దళాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు సైనికాధికారులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌తో ఉధంపూర్ జిల్లాలో ఉగ్రవాదుల కదలికలకు తాత్కాలికంగా బ్రేక్ పడిందని అధికారులు పేర్కొన్నారు.
