Fancy Number: ఫ్యాన్సీ నంబర్‌కు రూ.కోటికిపైగా వేలం పాడాడు.. తీరా..

ఇంటర్నెట్ డెస్క్: హరియాణాలో ఇటీవల ఓ ఫ్యాన్సీ వాహన నంబర్ కోసం ఆన్‌లైన్‌లో వేలం నిర్వహిస్తే.. ఏకంగా రూ.1.17 కోట్లు పలికింది. దీంతో ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన నంబర్‌గా వార్తల్లోకెక్కింది. అయితే.. ఆ నంబర్ దక్కించుకున్న వ్యక్తి మాత్రం గడువులోపు ఆ మొత్తాన్ని చెల్లించడంలో విఫలమయ్యాడు. దీంతో.. అసలు ఆ వ్యక్తి ఆదాయమెంత? అంత డబ్బు కట్టే స్తోమత ఉందా? అనే వివరాలు ఆరా తీయాలంటూ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అనిత్ విజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
వాహనాలకు ఫ్యాన్సీ నంబర్ల కోసం హరియాణా రవాణాశాఖ వారానికోసారి ఆన్‌లైన్ వేలం నిర్వహిస్తుంది. ఇటీవల ‘HR88B8888’ రిజిస్ట్రేషన్ నంబర్ కోసం అత్యధికంగా 45 మంది వాహనదారులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రారంభ ధరను రూ.50 వేలుగా నిర్ణయించారు. చివరకు హిసార్‌కు చెందిన ఓ వ్యక్తి రూ. 1.17 కోట్లకు దక్కించుకున్నాడు. ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు రూ.వెయ్యి, సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.10 వేలు చెల్లించాడు. రూ.1.17 కోట్లు కట్టేందుకు సోమవారం వరకు గడువు ఉండగా.. ముందుకు రాలేదు. దీంతో మంత్రి అనిల్ విజ్ ఈ వ్యవహారంపై దృష్టి సారించారు.
‘‘ఆ వ్యక్తి వాస్తవ ఆదాయం, ఆస్తులను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించాను. రూ.1.17 కోట్లు వేలం పాడేందుకు ఆ వ్యక్తికి నిజంగా అంత ఆర్థిక స్తోమత ఉందా? అనేది నిర్ధరించాల్సి ఉంది. వేలం ప్రక్రియను కొంతమంది బాధ్యతగా కాకుండా.. తేలికగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఈ తరహా వ్యవహారాలను నివారించేందుకు సమగ్ర దర్యాప్తు కోసం ఆదాయపు పన్ను శాఖకు రాతపూర్వక విజ్ఞప్తి పంపుతాం’’ అని మంత్రి తెలిపారు. ఆ నంబర్‌ను మరోసారి వేలం వేయనున్నట్లు సమాచారం.
