FASTag: ఫాస్టాగ్ యూజర్లకు ఊరట.. NHAI కీలక నిర్ణయం
FASTag | దిల్లీ: ఫాస్టాగ్ యూజర్లకు ఊరట కల్పిస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) కీలక నిర్ణయం తీసుకుంది. కార్లు, జీప్‌లు, వ్యాన్‌లకు కొత్తగా జారీ చేసే ఫాస్టాగ్‌లకు నో యువర్ వెహికల్ (KYV) ప్రక్రియను నిలుపుదల చేసింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని NHAI తెలిపింది. దీనివల్ల లక్షలాది మంది యూజర్లకు ప్రయోజనం చేకూరనుంది. వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలూ ఉన్నప్పటికీ కేవైవీ ప్రక్రియ కారణంగా ఫాస్టాగ్ యాక్టివేషన్‌లో జాప్యం జరుగుతున్నట్లు NHAI గుర్తించి ఈ నిబంధనను తొలగించింది.
ఇప్పటికే కార్లకు జారీ చేసిన ఫాస్టాగ్‌లకు కూడా కేవైవీ అవసరం లేదని NHAI స్పష్టంచేసింది. ఫాస్టాగ్‌ను సరిగా అతికించకపోవడం, దుర్వినియోగం వంటి సందర్భాల్లో మాత్రమే కేవైవీ అవసరం పడుతుంది. బ్యాంకులు ఫాస్టాగ్ ఇష్యూ చేసేటప్పుడే వాహన్ డేటాబేస్‌లో వివరాలను వెరిఫై చేసి యాక్టివేట్ చేస్తారు. ఫాస్టాగ్ సరైన వాహనానికి లింక్ చేసి ఉందా?విండ్ షీల్డ్‌కు సరిగా అతికించారా? లేదా? అనేది తెలుసుకోవడం కేవైవీ ప్రధాన లక్ష్యం. ఈ ప్రక్రియలో వాహనదారులు వాహనం ముందు, సైడ్ వ్యూ ఫొటోలు, ఆర్‌సీ, విండ్‌షీల్డ్‌కు అతికించిన ఫాస్టాగ్ స్టిక్కర్ ఫొటోలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. కేవైవీ నిబంధన తొలగింపుతో ఆ ఇబ్బంది తొలగనుంది.
