ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు ఖరారు.. మూడేళ్లకు ఒకే ఫీజు
హైదరాబాద్:
రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల గందరగోళానికి ప్రభుత్వం తెరదించింది. వచ్చే మూడు సంవత్సరాల బ్లాక్ పీరియడ్‌కు సంబంధించి ట్యూషన్ ఫీజులను అధికారికంగా ఖరారు చేసింది. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్సీ) సిఫార్సులను ఆమోదిస్తూ 160 కాలేజీలకు ఫీజులు నిర్ణయిస్తూ విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా జీవో నం.6 విడుదల చేశారు. ఈ ఫీజులు 2025–26, 2026–27, 2027–28 విద్యా సంవత్సరాలకు వర్తించనున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా నిర్ణయించిన ఫీజుల్లో అత్యధికంగా సీబీఐటీ కాలేజీలో రూ.1.83 లక్షలు ఉండగా, కనిష్టంగా సుమారు 19 కాలేజీల్లో రూ.45 వేలుగా నిర్ణయించారు. మొత్తం 160 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలలో 126 కాలేజీల్లో ఫీజు రూ.1 లక్షలోపే ఉండటం గమనార్హం. రూ.1 లక్షకు పైగా ఫీజు ఉన్న కాలేజీలు కేవలం 34 మాత్రమే ఉన్నాయి. ఇక 80 కాలేజీల్లో తక్కువ ఫీజులు ఉండటం తల్లిదండ్రులకు ఊరట కలిగించే అంశంగా మారింది.
ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల కారణంగా ఈ ఏడాది ఫీజులు భారీగా పెరగకుండా నియంత్రణలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 70 కాలేజీల్లో పాత ఫీజులనే కొనసాగించగా, 63 కాలేజీల్లో ఫీజులు పెరిగాయి. మిగతా కొన్ని కాలేజీల్లో ఫీజులు తగ్గించినట్లు వెల్లడించారు.
ఫీజుల నిర్ణయంతో పాటు విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. ట్యూషన్ ఫీజును ఒకేసారి కాకుండా వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశం కల్పించింది. ప్రభుత్వ నిర్ణయించిన ఫీజు తప్ప క్యాపిటేషన్ ఫీజు లేదా విరాళాల పేరుతో అదనంగా ఒక్క రూపాయి వసూలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాలేజీలు సమర్పించిన ఆదాయ వ్యయ వివరాల ఆధారంగానే ఫీజులు నిర్ణయించామని, అందులో తప్పులు ఉన్నట్లు తేలితే ఫీజులు తగ్గించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఫీజుల్లో టాప్ టెన్ కాలేజీలు:
సీబీఐటీ – రూ.1,83,000
వాసవి – రూ.1,75,000
ఎంజీఐటీ – రూ.1,67,000
సీవీఆర్ – రూ.1,63,000
జి.నారాయణమ్మ – రూ.1,62,000
గోకరాజు గంగరాజు – రూ.1,60,500
వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి – రూ.1,59,600
కిట్స్ – రూ.1,46,200
బీవీరాజు ఇన్‌స్టిట్యూట్ – రూ.1,46,600
ఎంవీఎస్ఆర్ – రూ.1,43,800
