హైదరాబాద్‌కు ఫస్ట్ యాపిల్ రిటైల్ స్టోర్.. హైరింగ్ ప్రారంభం
హైదరాబాద్:
హైదరాబాద్ నగరంలో తొలి యాపిల్ రిటైల్ స్టోర్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో యాపిల్ సంస్థ ఇప్పటికే హైరింగ్ ప్రక్రియను ప్రారంభించింది. హైదరాబాద్ రిటైల్ స్టోర్ కోసం స్టోర్ లీడర్, సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి నియామకాలు చేపట్టింది.
యాపిల్ సాధారణంగా రిటైల్ స్టోర్ ప్రారంభానికి సుమారు ఒక సంవత్సరం ముందే ఉద్యోగ నియామక ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఈ నేపథ్యంలో 2027 తొలిార్థంలో హైదరాబాద్‌లో యాపిల్ రిటైల్ స్టోర్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో యాపిల్ రిటైల్ స్టోర్లు కార్యకలాపాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో కూడా 2027 మార్చి నాటికి స్టోర్ ఓపెన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
టీ స్క్వేర్‌లోనే యాపిల్ స్టోర్?
హైదరాబాద్ యాపిల్ రిటైల్ స్టోర్ లొకేషన్‌గా రాయదుర్గంలోని ‘టీ స్క్వేర్’ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ తరహాలో హైదరాబాద్‌లో టీ స్క్వేర్ను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఐటీ హబ్ రాయదుర్గంలో ‘టీ స్క్వేర్’ పేరుతో భారీ టవర్ నిర్మాణానికి టీజీఐఐసీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ బిల్డింగ్‌లోనే యాపిల్ రిటైల్ స్టోర్ ఏర్పాటయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటీవల ప్రస్తావించారు. టీ స్క్వేర్ 24 గంటల పాటు కార్యకలాపాలు సాగేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆపిల్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లు అవుట్లెట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని, పార్కింగ్ సమస్యలు లేకుండా చూడాలని, వినియోగదారుల సౌకర్యార్థం ప్రత్యేక యుటిలిటీ జోన్ ఏర్పాటు చేయాలని సూచించారు.
టూరిజం, ఆదాయ వనరుగా టీ స్క్వేర్
టీ స్క్వేర్ ద్వారా హైదరాబాద్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్యను గణనీయంగా పెంచుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే దీనిని మేజర్ టూరిస్ట్ డెస్టినేషన్‌గా అభివృద్ధి చేయాలని టీజీఐఐసీ యోచిస్తోంది. టీ స్క్వేర్‌లో ఏర్పాటు చేసే వీడియో బిల్‌బోర్డులు, వాణిజ్య కార్యకలాపాలు, పర్యాటకుల రాకపోకల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
