Floating Rate Savings Bonds: ఆర్‌బీఐ భరోసా+ 8% వడ్డీ.. ఈ బాండ్ల గురించి తెలుసా?
RBI Floating Rate Savings Bonds | ఇంటర్నెట్‌డెస్క్: ఆర్‌బీఐ రెపో రేటును ఇటీవల తగ్గించడంతో దాదాపు అన్ని బ్యాంకులూ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (Fixed deposits) వడ్డీ రేట్లను తగ్గించేశాయి. ఏ కమర్షియల్ బ్యాంక్ చూసినా 6-6.50 శాతం మించి వడ్డీ ఇవ్వడం లేదు. దీంతో అధిక వడ్డీతో కూడిన పెట్టుబడి సాధనాల కోసం చాలామంది అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా రిస్క్ వద్దనుకునేవారికి ఓ స్కీమ్ అందుబాటులో ఉంది. అదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రవేశపెట్టిన ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్, 2020. ఈ బాండ్లపై అధిక వడ్డీతో పాటు ఆర్‌బీఐ భరోసా ఉంటుంది. దీనిపై ప్రస్తుతం ఏటా 8.05 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు.
ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్లలో (RBI Floating Rate Savings Bonds) వడ్డీ రేటు ఎల్లప్పుడూ ఒకేవిధంగా ఉండదు. ఆరు నెలలకోసారి మారుతూ ఉంటుంది. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఒకటైన నేషనల్ సేవింగ్స్ స్కీమ్ (NSC)తో ఈ వడ్డీ రేట్లు ముడిపడి ఉంటాయి. NSC వడ్డీ రేటును పెంచితే ఈ బాండ్ల రేటు కూడా పెరుగుతుంది. అలాగే NSC వడ్డీ రేటు తగ్గితే ఈ బాండ్లపై వడ్డీ కూడా తగ్గుతుంది. ఎన్‌ఎస్‌సీ అందించే వడ్డీ రేటు కన్నా 0.35 శాతం ఎక్కువ రేటు ఈ బాండ్లపై లభిస్తుంది. 2026 జనవరి- జూన్ అర్ధ వార్షికానికి 8.05 శాతంగా వడ్డీ రేటును ఆర్‌బీఐ తాజాగా ఖరారు చేసింది. నేషనల్ సేవింగ్స్ స్కీమ్ 7.7 శాతం వడ్డీ రేటు లభిస్తుండగా.. ఆర్‌బీఐ బాండ్లపై 8.05 శాతం వడ్డీ అందుతుంది. ఏడాదికి రెండు సార్లు (జనవరి 1, జులై 1) వడ్డీ మొత్తం మీ ఖాతాలో జమ అవుతుంది.
ఇవి తెలుసుకోండి..
- ఆర్‌బీఐ ప్రవేశపెట్టిన ఈ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్ కాల వ్యవధి ఏడేళ్లు. ఈ బాండ్లలో ముందస్తు ఉపసంహరణకు అవకాశం ఉండదు.
- సీనియర్ సిటిజన్లు మాత్రం కనీస లాక్-ఇన్ పీరియడ్ తర్వాత పెనాల్టీతో ముందుగానే డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. 60-70 మధ్య వయసున్న వారికి ఆరేళ్లు, 70-80 మధ్య వయసున్న వారికి ఐదేళ్లు, 80 ఏళ్లు దాటిన వారికి నాలుగేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది.
- కనిష్ఠంగా వెయ్యి రూపాయలతో ఈ బాండ్లను కొనుగోలు చేయొచ్చు. గరిష్ఠ పరిమితి లేదు. వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు ఉంటాయి కాబట్టి భవిష్యత్‌లో తగ్గితే రాబడిపై ప్రభావం ఉంటుందని గుర్తుంచుకోవాలి.
- ఈ బాండ్లపై వచ్చే వడ్డీపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ బాండ్లపై రుణ సదుపాయం లేదు. వీటిని ఇతరులకు బదిలీ చేసుకోవడమూ కుదరదు.
- ఎక్కువ వడ్డీ ఇచ్చే పథకం అయినా ఏడేళ్ల పాటు డబ్బుతో అవసరం లేదనుకున్నవారు మాత్రమే ఇందులో పెట్టుబడి పెట్టడం మంచిది.
- ఫిక్స్‌డ్ డిపాజిట్ల ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది ఉపయోగపడుతుంది.
- తక్కువ పన్ను పరిధిలో ఉండి, రిస్క్ లేకుండా పెట్టుబడి చేయాలనుకొనేవారు ఈ మార్గాన్ని ఎంచుకోవచ్చు. ప్రత్యేకించి సీనియర్ సిటిజన్‌లకు ఇది స్థిరమైన ఆదాయ వనరుగా పని చేస్తుంది.
- ఆర్‌బీఐ ఆథరైజేషన్ పొందిన ఏదైనా బ్యాంక్ శాఖలో వీటిని కొనుగోలు చేయొచ్చు. ఇందుకోసం కేవైసీ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
- బ్యాంక్ వెబ్‌సైట్లు, ఆర్‌బీఐకి చెందిన రిటైల్ డైరెక్ట్ పోర్టల్ నుంచి కూడా ఈ బాండ్లను కొనుగోలు చేయొచ్చు. కాంపౌండింగ్ ప్రయోజనం ఉండదు.
- భారత నివాసితులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు వీటిని కొనుగోలు చేయొచ్చు. ఎన్నారైలకు అవకాశం లేదు.
- ఉదాహరణకు మీరు ఈ బాండ్లలో రూ.లక్ష పెట్టుబడి పెడితే 8.05 శాతం వడ్డీ చొప్పున ప్రతి ఆరు నెలలకు దాదాపు రూ.4 వేలు చొప్పున మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.
- వడ్డీ ఆదాయంపై పన్ను వర్తిస్తుంది. బాండ్ కొనుగోలుదారుడి ఆదాయ శ్లాబు రేటుపై ఇది ఆధారపడి ఉంటుంది. వార్షికాదాయం రూ.10వేలు దాటితే టీడీఎస్ వర్తిస్తుంది. ఫారం 15G/15H సమర్పించడం ద్వారా అర్హులైన వారు టీడీఎస్ నుంచి మినహాయింపు పొందొచ్చు.
