మున్సిపల్ ఎన్నికల్లో డబ్బుల వరద.. ఓటుకు వేలల్లో ఆఫర్లు, ఆస్తులు అమ్ముకుని ప్రచారం!
ఖమ్మం/కరీంనగర్/నెట్వర్క్ :
రాష్ట్రంలో ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ఓటర్లకు డబ్బులు, బహుమతుల పంపిణీకి తెగబడుతున్నారు. ఓటుకు నగదు, మటన్, చికెన్, మద్యం, చీరలు, బియ్యం పంపిణీ జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా తాయిళాల పంపకాల్లో పోటీ పడుతున్నారు.
ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ 15వ వార్డులో పరిస్థితి హద్దులు దాటింది. ఇక్కడ ఓ అభ్యర్థి ముందస్తుగా ఓటుకు రూ.500 నగదు, స్వీట్ బాక్స్ పంచగా, మరో అభ్యర్థి కేజీ చికెన్, మహిళలకు ఖరీదైన చీరల ఆశ చూపుతున్నాడు. మరోవైపు ఓ అభ్యర్థి ఇంటింటికీ 25 కేజీల బియ్యం పంపిణీకి సిద్ధమవుతుండగా, ఇంకొకరు ఓటుకు రూ.5 వేల వరకు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఒక్క వార్డులోనే అభ్యర్థి ఖర్చు కోటిన్నర వరకు చేరవచ్చన్న చర్చ స్థానికంగా సాగుతోంది.
కరీంనగర్ కార్పొరేషన్‌లోని ఓ వార్డులో ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థి ఇప్పటికే ఓటుకు రూ.2 వేల చొప్పున పంపిణీ చేయగా, మరో పార్టీ అభ్యర్థి రూ.3 వేల చొప్పున పంచేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఇద్దరూ ఓటర్లను ఆకర్షించేందుకు ఒక్కొక్కరు రూ.50 లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. పార్టీ నుంచి ఫండ్లు రాకపోవడంతో ఒకరు తన ప్లాటును, మరొకరు వ్యవసాయ భూమిని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకున్నారని ప్రచారం జరుగుతోంది. తామెవరినీ డబ్బులు అడగకపోయినా బతిమిలాడి మరీ చేతిలో పెట్టిపోతున్నారని కొందరు ఓటర్లు వాపోతున్నారు.
కరీంనగర్లో రూ.100 కోట్ల ఖర్చు?
కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. 66 డివిజన్లలో 398 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, దాదాపు 250 మంది భారీగా ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు. కొన్ని డివిజన్లలో ఒక్కో అభ్యర్థి రూ.50 లక్షల నుంచి రూ.కోటికి పైగా వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన మొత్తం కార్పొరేషన్ వ్యాప్తంగా ఖర్చు రూ.100 కోట్లను దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
ఆస్తులు తనఖా పెట్టి ప్రచారం
మంచిర్యాలలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. అభ్యర్థులు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు చేస్తూ, ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు పంపిణీ చేస్తున్నారు. కామారెడ్డిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ములుగులో ఆయిల్ ప్యాకెట్లు, మటన్ పంపిణీ జరుగుతుండగా, మెదక్ జిల్లాలో పోలింగ్ ముందు ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు ఇవ్వాలనే ప్లాన్లు సిద్ధమవుతున్నాయి.
యాదాద్రి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లోని 104 వార్డుల్లో దాదాపు అన్ని చోట్ల ఓటుకు రూ.3 వేల వరకు ఇవ్వడానికి అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో కొందరు ఆస్తులు తనఖా పెట్టి, రూ.5 చొప్పున వడ్డీకి లక్షలకు లక్షలు అప్పులు తెచ్చుకుంటున్నట్లు సమాచారం.
అగ్గువకు ఆస్తుల అమ్మకాలు
హుస్నాబాద్‌లో చైర్మన్ పదవికి పోటీ పడుతున్న ఓ అభ్యర్థి ప్రచారం కోసం రూ.95 లక్షలకు విలువైన ప్లాటును అమ్ముకున్నాడు. దుబ్బాకలో మరో అభ్యర్థి సిద్ధిపేటలోని అపార్ట్మెంట్ ఫ్లాట్‌ను రూ.25 లక్షల అగ్గువకు విక్రయించాడు. చేర్యాలలో ఓ అభ్యర్థి ఓపెన్ ప్లాట్‌ను తాకట్టు పెట్టి వచ్చిన రూ.15 లక్షలను పోలింగ్ ముందు రోజు పంపిణీకి సిద్ధం చేసినట్లు తెలిసింది.
