చరిత్రలో తొలిసారి వనదేవతల చెంత.. జనవరి 18న తెలంగాణ కేబినెట్ భేటీ!
హైదరాబాద్:
రాష్ట్ర పాలనలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు సచివాలయానికే పరిమితమైన అత్యున్నత స్థాయి కేబినెట్ సమావేశం.. తొలిసారిగా అడవిబాట పట్టనుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మల చెంతనే ఈసారి రాష్ట్ర మంత్రిమండలి సమావేశాన్ని నిర్వహించాలని సీఎం ఏ. రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 18న ములుగు జిల్లా మేడారంలో ఈ చారిత్రక భేటీ జరగనుంది.
పాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లడమే కాకుండా గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటిచెప్పేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అటవీ ప్రాంతంలో, గిరిజన క్షేత్రంలో అధికారికంగా పూర్తిస్థాయి కేబినెట్ సమావేశం నిర్వహించడం ఉమ్మడి ఏపీతో పాటు తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం విశేషం.
జాతర ఏర్పాట్లపై ఫోకస్.. బడ్జెట్ కసరత్తు
త్వరలో జరగనున్న మేడారం మహాజాతరకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చే నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో కేబినెట్ సమావేశాన్ని అక్కడే నిర్వహించి, క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను నేరుగా పర్యవేక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది.
జాతర నిర్వహణకు అవసరమైన నిధులు, భద్రతా చర్యలు, భక్తుల సౌకర్యాలపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇదే సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వివిధ శాఖల్లో అమలవుతున్న ఆరు గ్యారంటీల ప్రగతిపై కూడా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
సీఎం బిజీ షెడ్యూల్
ఈ నెల 18న మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి మేడారం చేరుకోనున్నారు. కేబినెట్ సమావేశం అనంతరం ఆ రాత్రి అక్కడే బస చేస్తారు. 19న ఉదయం అమ్మవార్ల నూతన ప్రాంగణాలను ప్రారంభించి, దర్శనం చేసుకుంటారు. అనంతరం హైదరాబాద్ చేరుకుని, అదే రోజు సాయంత్రం ప్రపంచ ఆర్థిక వేదిక ‘దావోస్’ పర్యటనకు బయలుదేరనున్నారు.
