జీడిమెట్ల ఈఎస్‌ఐ ఆసుపత్రిలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
హైదరాబాద్, జనవరి 30: తెలంగాణ రాష్ట్ర ఈఎస్‌ఐ (ESI) మరియు బసవతారకం క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ (ఇన్సూర్డ్ పర్సన్స్ – IPs) కోసం నిర్వహించిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ కు పెద్ద సంఖ్యలో పేషెంట్స్ హాజరయ్యారు. శుక్రవారం నిర్వహించిన ఈ శిబిరం కార్మిక & ఉపాధి శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి మార్గదర్శకత్వంలో జీడిమెట్లలోని ఈఎస్‌ఐ ఆసుపత్రిలో ఏర్పాటు చేయబడింది. ఈ స్క్రీనింగ్ శిబిరానికి మొత్తం 231 మంది ఇన్సూర్డ్ పర్సన్స్ హాజరుకాగా, అందులో 154 మంది మహిళలు, 77 మంది పురుషులు ఉన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నుంచి 6 మంది ఆంకాలజీ నిపుణులు, ఈఎస్‌ఐ నుంచి 10 మంది వైద్యులు శిబిరాన్ని పర్యవేక్షించారు. స్క్రీనింగ్‌లో భాగంగా ఎక్స్-రే, మామోగ్రఫీ, అల్ట్రాసౌండ్ సోనోగ్రఫీ, పాప్‌స్మియర్ తదితర పరీక్షలు నిర్వహించారు. ఈ స్క్రీనింగ్ క్యాంప్ సేవలపై రోగులు సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇలాంటి శిబిరాలు మరిన్ని నిర్వహించాలని కోరారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈఎస్‌ఐకి చెందిన అన్ని ఇన్సూర్డ్ పర్సన్స్‌కు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహించేందుకు రాష్ట్ర ఈఎస్‌ఐ మరియు బసవతారకం క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ మధ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
