అడవిలోని గుడిసె నుంచి కోటి కాంతుల కోవెల దాకా… కేస్లాపూర్ నాగోబా ఆలయ ఘన చరిత్ర
ఆదిలాబాద్: దశాబ్దాల క్రితం అటవీ ప్రాంతంలో ఓ చిన్న గుడిసెలో కొలువైన ఆదిశేషుడు నేడు కోటి కాంతుల ఆలయంలో భక్తులను దర్శనమిస్తున్నాడు. కాలానుగుణంగా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతర దినదినాభివృద్ధి చెందుతూ ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది.
మెస్రం వంశీయుల ఆచార–సాంప్రదాయాలకు అనుగుణంగా ఆలయ నిర్మాణాల్లో మార్పులు చేస్తూ నేడు ఈ ఆలయం ఓ గొప్ప కళాఖండంగా రూపుదిద్దుకుంది. నాగోబా జాతర ప్రారంభం కావడంతో ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. దశాబ్దాల చరిత్రను సంతరించుకున్న నాగోబా ఆలయం ఆదివాసీ ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతిరూపంగా నిలుస్తోంది.
1942కు ముందు మెస్రం వంశీయులు అడవిలోని పుట్టను నాగోబాగా కొలుస్తూ పూజలు నిర్వహించేవారు. అనంతరం చిన్న పందిరి గుడిసె ఏర్పాటు చేసి సంప్రదాయ పూజలు కొనసాగించారు. 1960 నుంచి ఆలయ నిర్మాణం క్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఆలయ పీఠాధిపతి మెస్రం దేవరావు పటేల్ 1960లో ఒకసారి, 1977లో మరోసారి ఆలయాన్ని నిర్మించారు. 1996లో మరోసారి పునర్నిర్మాణం చేపట్టారు.
ప్రతి దశలోనూ మెస్రం వంశీయులే స్వయంగా చందాలు సేకరించి ఆలయ అభివృద్ధికి కృషి చేశారు. తాజాగా 2022లో మరోసారి పెద్ద ఎత్తున చందాలు సమీకరించి సుమారు రూ.5 కోట్ల వ్యయంతో నాగోబా ఆలయాన్ని పూర్తిస్థాయిలో నిర్మించారు. దీంతో అడవిలోని గుడిసెగా మొదలైన నాగోబా ఆలయం నేడు కోటి కాంతులతో వెలుగొందే మహా దేవాలయంగా రూపాంతరం చెందింది.
