ట్రెక్కింగ్ నుంచి సౌండ్ మెడిటేషన్ వరకు.. తెలంగాణలో అడ్వెంచర్ టూరిజం జోరు
హరిత హోటల్ సిబ్బందినే టూరిస్ట్ గైడ్లుగా తీర్చిదిద్దే యాక్షన్ ప్లాన్
హైదరాబాద్ :
రాష్ట్రంలో పర్యాటక రంగం రూపురేఖలు మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేలా కొత్త యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా అడ్వెంచర్ టూరిజంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. కేరళ, కర్ణాటక తరహాలో ప్రకృతి ఆధారిత పర్యాటక అనుభూతులను అందించేందుకు సరికొత్త ప్రయోగాలకు సిద్ధమవుతోంది.
అడవుల్లో ట్రెక్కింగ్, చెరువులు–ప్రాజెక్టుల వద్ద ఫిష్ హంటింగ్ (యాంగ్లింగ్), ప్రకృతి ఒడిలో సైకిల్ సవారీ వంటి వినూత్న కార్యక్రమాలను రూపొందిస్తోంది. కేవలం ప్రదేశాలు చూపించి వెళ్లిపోవడం కాకుండా, పర్యాటకులు ఆ ప్రాంతంతో మమేకమయ్యేలా అనుభూతినిచ్చే టూరిజాన్ని ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది.
హరిత సిబ్బందికే గైడ్ బాధ్యతలు
బయట వ్యక్తులపై ఆధారపడకుండా టూరిజం శాఖలోని హరిత హోటళ్ల సిబ్బందినే టూరిస్ట్ గైడ్లుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నాగార్జునసాగర్, వరంగల్, అనంతగిరి, భద్రాచలం, రామప్ప, వేములవాడ, సిద్దిపేట తదితర ప్రాంతాల్లో దాదాపు 23 హరిత హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిలో 350 నుంచి 400 మంది వరకు సిబ్బంది పనిచేస్తున్నారు.
ఇప్పటివరకు ఫుడ్ సర్వింగ్, రూం సర్వీసులకే పరిమితమైన ఈ సిబ్బందిని మల్టీపర్పస్‌గా వినియోగించుకోవాలని టూరిజం శాఖ నిర్ణయించింది. ఇందుకోసం నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. పర్యాటకులతో ఎలా మాట్లాడాలి, తెలంగాణలోని పర్యాటక ప్రాంతాల విశిష్టత, చరిత్ర, అటవీ ప్రాంతాలు, అక్కడి జంతువులు–పక్షులు, భద్రతా చర్యలు వంటి అంశాలపై వీరికి అవగాహన కల్పించనున్నారు. విదేశీ, దేశీయ పర్యాటకులకు గైడ్లుగా వీరు సైట్ సీయింగ్‌కు తీసుకెళ్లనున్నారు.
ప్రకృతితో మమేకమయ్యే అనుభూతి
తెలంగాణలో కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతాలు, జలపాతాలకు కొదవలేదు. ఈ ప్రకృతి సంపదను టూరిజంతో మేళవించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్‌లో అడవిలో ట్రెక్కింగ్, భువనగిరి కోట పరిసరాల్లో నడక మార్గాలు, బోగత, కుంటాల జలపాతాల వద్ద అడ్వెంచర్ టూరిజం కార్యక్రమాలు పర్యాటకులకు మధురానుభూతిని అందించనున్నాయి.
చెరువులు, సరస్సులు, ప్రాజెక్టుల వద్ద ఫిష్ హంటింగ్, పచ్చని అడవుల్లో సైక్లింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. హరిత హోటళ్లలోనే సైకిళ్లు అందుబాటులో ఉంచనున్నారు. వికారాబాద్ అటవీ ప్రాంతం, కవ్వాల్ టైగర్ రిజర్వ్ బఫర్ జోన్, పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అమ్రాబాద్–మన్ననూర్ చెక్‌పోస్ట్ పరిసరాలు సైక్లింగ్‌కు అనువైన ప్రాంతాలుగా గుర్తించారు.
సౌండ్ మెడిటేషన్, బర్డ్ వాచింగ్ కూడా
పర్యాటకులకు కేవలం అడ్వెంచర్ మాత్రమే కాదు.. మానసిక ప్రశాంతతను అందించే కార్యక్రమాలపై కూడా దృష్టి పెట్టారు. అడవిలో పక్షుల కిలకిలారావాల మధ్య, ప్రకృతి శబ్దాలను ఆస్వాదిస్తూ ‘సౌండ్ మెడిటేషన్’ చేయించేలా ప్లాన్ చేస్తున్నారు. అలాగే బర్డ్ వాచింగ్, వైల్డ్ లైఫ్ అవగాహన, తెలంగాణ సంస్కృతిని పరిచయం చేసే ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.
అనుభూతినిచ్చే పర్యాటకమే లక్ష్యం
రాష్ట్రంలో ఉన్న అటవీ సంపద, జలపాతాలు, ట్రెక్కింగ్ పాయింట్లను ప్రపంచానికి పరిచయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని టూరిజం ఎండీ వల్లూరు క్రాంతి తెలిపారు.
“కేవలం చూసి వెళ్లే పర్యాటకం కాకుండా, అనుభూతిని పంచే ఎక్స్‌పీరియెన్షియల్ టూరిజంపై దృష్టి పెట్టాం. ట్రెక్కింగ్, సైక్లింగ్, ఫిషింగ్ వంటి యాక్టివిటీస్‌ను అందుబాటులోకి తెస్తున్నాం. హరిత సిబ్బందికే గైడ్లుగా శిక్షణ ఇవ్వడం వల్ల పర్యాటకులకు భద్రతతో పాటు మెరుగైన ఆతిథ్యం లభిస్తుంది. వీకెండ్స్‌లో కుటుంబాలు, యువత అడ్వెంచర్‌ను ఆస్వాదించేలా టూరిజం క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నాం” అని తెలిపారు.
