చెన్నూరు మున్సిపాలిటీ అభివృద్ధికి పూర్తి సహకారం – మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి
చెన్నూరు:
చెన్నూరు మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు తాను నిరంతరం కృషి చేస్తానని, ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చే ప్రతి అంశాన్ని గమనించి తప్పకుండా పరిష్కారం చూపుతానని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖా మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. మున్సిపాలిటీ అభివృద్ధి చెందితే వ్యాపార రంగం కూడా అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
మంగళవారం చెన్నూరు మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని మార్వాడీ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మార్వాడీ సామాజిక వర్గానికి చెందిన స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై, చెన్నూరు పట్టణ అభివృద్ధి, వ్యాపార సమస్యలు, మౌలిక వసతులపై తమ అభిప్రాయాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
చెన్నూరు పట్టణ అభివృద్ధిపై మంత్రి మాట్లాడుతూ,
“నేను మొదట ఇక్కడికి వచ్చినప్పుడు కనీస మౌలిక వసతులు కూడా లేవు. ఆటోలు వార్డుల్లోకి రావాలంటే రూ.200 అడిగే పరిస్థితి ఉండేది. గెలిచిన వెంటనే మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్లు నిర్మించాం. ప్రస్తుతం సుమారు రూ.40 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. కొత్త కాలనీలు వస్తే తప్పకుండా మౌలిక వసతులు కల్పించాలి” అని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, “అనవసరపు ఖర్చులతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు” అని విమర్శించారు.
చెన్నూరు ప్రజలకు గోదావరి నీరు అందించేందుకు రూ.45 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశామని, దీని ద్వారా వచ్చే 15 ఏళ్ల పాటు తాగునీటి సమస్య ఉండదని మంత్రి తెలిపారు.
అభివృద్ధి పనుల వివరాలు:
- చెన్నూరులో నూతనంగా ఏటీసీ సెంటర్ ఏర్పాటు
- జైపూర్ పవర్ ప్లాంట్‌లో 850 మెగావాట్ల నూతన విద్యుత్ కేంద్రం పనులకు ప్రారంభం
- చెన్నూరు సుందరీకరణకు రూ.10 కోట్ల నిధుల మంజూరు
- రూ.1.60 కోట్లతో బైపాస్ రోడ్డు పనులకు శంకుస్థాపన
- రోడ్డు వెడల్పులో నష్టపోయే పేదలకు కొత్త షాపుల నిర్మాణం
- స్మశానవాటిక అభివృద్ధికి రూ.1.2 కోట్లతో పనులు ప్రారంభం
- మే నెలలో 100 పడకల ఆసుపత్రి ప్రారంభం
- సోమనపల్లి గ్రామంలో కేజీ నుంచి పీజీ వరకు చదివేలా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం
మార్వాడీ సమాజంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ,
“నేను అమెరికా వెళ్లాలనుకున్న సమయంలో మా నాన్నగారు ఇక్కడే పరిశ్రమ ఏర్పాటు చేయాలని సూచించారు. అప్పట్లో నేను మొదట కలిసి పని చేసింది మార్వాడీ సోదరులతోనే. అందుకే మీతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అనవసరపు ఖర్చులు చేయకుండా ఉండటం, క్రమశిక్షణతో వ్యవహరించడం మీ నుంచి నేర్చుకున్నాను. యంగ్ ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్‌లో దాదాపు 60 శాతం మంది మార్వాడీలే ఉన్నారు” అని అన్నారు.
మీ ప్రేమ, అనురాగాలు ఎప్పటికీ తనపై ఇలాగే ఉండాలని ఆకాంక్షించారు.
చెన్నూరు మున్సిపాలిటీని ఇంకా ఎలా అభివృద్ధి చేయాలో ప్రజలు తమ సలహాలు ఇవ్వాలని కోరిన మంత్రి, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.
అలాగే 2027 పుష్కరాల సందర్భంగా చెన్నూరు నియోజకవర్గానికి అధిక నిధులు మంజూరు చేయాలని క్యాబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్లు తెలిపారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించి అధిక నిధులు ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. మేడారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసినట్లే, పుష్కరాలను కూడా వైభవంగా నిర్వహిద్దామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.
