జీహెచ్ఎంసీ మూడు కార్పొరేషన్లు – ఓఆర్ఆర్ వరకు జలమండలి విస్తరణ
హైదరాబాద్: పరిపాలన సౌలభ్యం దృష్ట్యా జీహెచ్ఎంసీని రాష్ట్ర ప్రభుత్వం మూడు వేర్వేరు కార్పొరేషన్లుగా విభజించింది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ బుధవారం (ఫిబ్రవరి 11) ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్లకు కమిషనర్లను నియమించింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా సృజన నియమితులయ్యారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా వినయ్ కృష్ణా రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అదే పదవిలో కొనసాగనున్నారు.
ఐఏఎస్‌ల బదిలీలు
ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
- సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధ ప్రకాష్ నియమితులయ్యారు.
- ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక సీఎస్‌గా సవ్యసాచి ఘోష్ నియమితులై, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక సీఎస్‌గా కూడా కొనసాగనున్నారు.
- ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియాకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
- పంచాయతీ రాజ్ కమిషనర్‌గా దివ్యకు అదనపు బాధ్యతలు ఇచ్చారు.
- ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా కాత్యాయనీ దేవీ నియమితులయ్యారు. ఆమె రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ జేఎండీగా అదనపు బాధ్యతలు కొనసాగించనున్నారు.
- పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా రఘురామ్ శర్మ నియమితులై, మంత్రి శ్రీధర్ బాబు ఓఎస్డీగా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు.
ఓఆర్ఆర్ వరకు జలమండలి విస్తరణ
జీహెచ్ఎంసీ విభజనతో పాటు జలమండలి పరిధిని ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వరకు విస్తరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ ముగ్గురు అధికారులను ఈడీలుగా నియమించింది.
- పంకజను జలమండలి మల్కాజిగిరి ఈడీగా
- సామ్రాట్ అశోక్‌ను హైదరాబాద్ ఈడీగా
- సంతోష్‌ను సైబరాబాద్ ఈడీగా నియమించింది.
ప్రస్తుతం ఈడీగా పనిచేస్తున్న మయాంక్ మిట్టల్‌కు జాయింట్ ఎండీగా పదోన్నతి ఇచ్చింది.
ఇకపై ఓఆర్ఆర్ పరిధిలోని నీటి సరఫరా, మురుగు వ్యవస్థ నిర్వహణ బాధ్యతలు పూర్తిగా జలమండలికి చెందనున్నాయి. ఈ మేరకు జీహెచ్ఎంసీ నుంచి ఆ బాధ్యతలను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుతం జలమండలి 1,450 చదరపు కిలోమీటర్ల మేర మంచినీటి సరఫరా, 650 చదరపు కిలోమీటర్ల మేర సివరేజ్ నిర్వహిస్తోంది. విస్తరణతో ఇకపై 2,053 చదరపు కిలోమీటర్ల పరిధిలో నీటి సరఫరా, మురుగు నిర్వహణ చేపట్టనుంది. అవసరమైన ప్రాంతాల్లో కొత్త సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం, సంబంధిత మౌలిక వసతుల అభివృద్ధి కూడా జలమండలి చేపట్టనుంది.
ఈ నిర్ణయాలతో నగర పరిపాలనలో సమర్థత పెంపుతో పాటు మౌలిక వసతుల నిర్వహణలో మెరుగుదల సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది.
