హోమ్‌వర్క్ చేయలేదని కొట్టడంతో బాలికకు శాశ్వత వినికిడి లోపం.. టీచర్‌కు మూడేళ్ల జైలు శిక్ష
గుజరాత్/గాంధీనగర్:
ఒకప్పుడు స్కూల్ అంటే పిల్లల అల్లరి, టీచర్ల మందలింపులు, అప్పుడప్పుడూ బెత్తం దెబ్బలు… ఇవన్నీ సాధారణంగా జరిగే విషయాలుగా భావించేవారు. “పిల్లల్ని నాలుగు దెబ్బలు తగిలిస్తేనే దారిలో పడతారు” అనే ఆలోచన కూడా సమాజంలో బలంగా ఉండేది. కానీ కాలం మారింది. పిల్లల హక్కులు, భద్రతపై చట్టాలు కఠినంగా అమలవుతున్న ఈ రోజుల్లో చిన్న తప్పిదం కూడా తీవ్ర పరిణామాలకు దారి తీస్తోంది. ఇందుకు తాజా ఉదాహరణ గుజరాత్లో చోటు చేసుకున్న ఓ ఘటన.
గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో 2020లో ఈ ఘటన జరిగింది. 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక హోమ్‌వర్క్ చేయలేదన్న కారణంతో ఆమెను స్కూల్ టీచర్ శిక్షించింది. ఆ సమయంలో టీచర్ చేసిన దాడి తీవ్రంగా ఉండటంతో బాలికకు చెవికి గాయమై, కర్ణభేరి దెబ్బతిన్నట్లు వైద్యులు నిర్ధారించారు. కొద్ది రోజులకే ఆ బాలిక వినికిడి శక్తిని పూర్తిగా కోల్పోయినట్లు తెలిసింది.
ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందిన బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. టీచర్‌పై కేసు నమోదు కావడంతో విషయం కోర్టు వరకు వెళ్లింది. ఐదేళ్ల పాటు ఈ కేసుపై గాంధీనగర్ కోర్టులో విచారణ కొనసాగింది. ఈ మధ్యే కోర్టు తుది తీర్పు వెల్లడించింది. బాలికకు శారీరక గాయం కలిగించి, శాశ్వత వినికిడి లోపానికి కారణమైనందుకు సంబంధిత టీచర్‌కు మూడేళ్ల మూడు నెలల జైలు శిక్ష విధించింది. అంతేకాదు, రూ.50 వేల జరిమానా కూడా విధిస్తూ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
కేసు విచారణ సమయంలో టీచర్ రాజీకి ప్రయత్నించినప్పటికీ బాలిక తల్లిదండ్రులు అంగీకరించలేదని తెలుస్తోంది. తమ కూతురు టీచర్ దాడి కారణంగానే పూర్తిగా వినికిడి కోల్పోయిందని, ఈ ఘటన ఆమెను తీవ్ర మానసిక వేదనకు గురిచేసిందని వారు కోర్టుకు వివరించారు. చదువు, భవిష్యత్తు అన్నీ ఒక్కసారిగా దెబ్బతిన్నాయని వాదించారు.
సాధారణంగా స్కూల్ గదుల్లో జరిగే మందలింపులు, శిక్షలు ఈ స్థాయిలో దారుణ పరిణామాలకు దారి తీయడం కలచివేసే విషయం. ఒక చిన్న హోమ్‌వర్క్ తప్పిదం కారణంగా ఓ విద్యార్థిని జీవితాంతం వినికిడి కోల్పోవడం, అదే సమయంలో ఓ టీచర్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి రావడం ప్రస్తుతం విద్యావ్యవస్థలో శిక్ష విధానాలపై తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ తీర్పుతో ఇకపై స్కూల్లలో శారీరక శిక్షలపై మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న సందేశం బలంగా వెళ్లిందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
