Lionel Messi: ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’.. 70 అడుగుల మెస్సి విగ్రహం ఆవిష్కరణ
ఇంటర్నెట్ డెస్క్: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి (Lionel Messi) ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’ ప్రారంభమైంది. శనివారం తెల్లవారుజామున అతడు కోల్‌కతాకు చేరుకున్నాడు. మెస్సితో పాటు అతడి ఇంటర్ మియామీ జట్టు సహచరులు రోడ్రిగో డిపాల్, లూయిస్ సువారెజ్ భారత్‌కు వచ్చారు. 14 ఏళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన మెస్సిని చూడటానికి విమానాశ్రయానికి అభిమానులు వందల సంఖ్యలో తరలివచ్చారు. అర్జెంటీనా జెండాలను చేతబూని ‘మెస్సి మెస్సి’ అంటూ నినాదాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు. కోల్‌కతాలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో మెస్సి బృందం బస చేసింది.
ఉదయం లేక్‌టౌన్‌లో తన 70 అడుగుల విగ్రహాన్ని బాలీవుడ్ నటుడు షారుక్‌ఖాన్‌తో కలిసి మెస్సి వర్చువల్‌గా ఆవిష్కరించాడు. భద్రతా కారణాల రీత్యా మెస్సి అక్కడికి వెళ్లలేదు. తర్వాత సాల్ట్‌లేక్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ గంగూలీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీలను కలుస్తాడు. శనివారం కోల్‌కతాలో కార్యక్రమం ముగియగానే మెస్సి హైదరాబాద్ బయలుదేరతాడు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటాడు. ఆ తర్వాత గోట్ కప్ పేరుతో ఉప్పల్ స్టేడియంలో నిర్వహించే ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఆడతాడు. ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఆడతారు.
మొత్తం 72 గంటల కంటే తక్కువే భారత్‌లో గడిపే మెస్సి.. కోల్‌కతా, హైదరాబాద్‌తో పాటు, ముంబయి, దిల్లీల్లోను పర్యటిస్తాడు. 14న ముంబయిలో, 15న దిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటాడు. సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడంతో గోట్ పర్యటన ముగుస్తుంది.
