రైతులకు టీజీఈఆర్‌సీ శుభవార్త.. అదనపు స్తంభాలకు ఇక ఓఆర్సీ లేదు
హైదరాబాద్ :
రైతులకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) శుభవార్త తెలిపింది. అదనపు విద్యుత్ స్తంభాల కోసం గతంలో అమల్లో ఉన్న ఔట్ రైట్ కంట్రిబ్యూషన్ (ఓఆర్సీ) చెల్లించాల్సిన అవసరం ఇక లేదని టీజీఈఆర్‌సీ కొత్త గెజిట్ విడుదల చేసింది.
రాష్ట్రంలో కేటగిరీల వారీగా విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు సంబంధించి సవరించిన చార్జీలను గెజిట్‌లో ప్రకటించింది. తాజా నిర్ణయం ప్రకారం రైతులు ఇకపై కిలోవాట్‌కు రూ.1,000 చొప్పున తమకు అవసరమైన సామర్థ్యం మేరకు ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఆ మేరకు విద్యుత్ సిబ్బంది కనెక్షన్ మంజూరు చేస్తారు.
ఇంతకుముందు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం రైతు పొలంలో ఉన్న మోటారు మూడు విద్యుత్ స్తంభాల పరిధిలో ఉంటేనే కనెక్షన్ ఇచ్చేవారు. ఆ దూరం మించి ఉంటే అదనపు స్తంభాల కోసం ఓఆర్సీ కింద రూ.40 వేలకుపైగా చెల్లించాల్సి వచ్చేది. టీజీఈఆర్‌సీ తాజా గెజిట్‌తో రైతులపై ఉన్న ఈ భారం పూర్తిగా తొలగనుంది.
ఇకపై 20 హెచ్‌పీ లోపు మోటార్లకు కిలోవాట్‌కు రూ.1,000 చొప్పున ఫీజు చెల్లిస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు.
అపార్ట్‌మెంట్లకు ఈజీగా విద్యుత్ కనెక్షన్
నగరాల్లోని అపార్ట్‌మెంట్లు, హై రైజ్ భవనాల్లో నివసించే ప్రజలకు కూడా టీజీఈఆర్‌సీ తీపికబురు చెప్పింది. ఇకపై అపార్ట్‌మెంట్లకు విద్యుత్ కనెక్షన్ ప్రక్రియ సులభతరం కానుంది. ఎస్టిమేషన్‌ల పేరిట జరిగే అక్రమ వసూళ్లకు తెరపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
ఇకపై ఈఆర్‌సీ నిర్ణయించిన రేట్ల ప్రకారం ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లిస్తే కనెక్షన్ ఇవ్వాల్సిందే.
డొమెస్టిక్ కేటగిరీలో చార్జీలు ఇలా ఉన్నాయి:
- 1 కిలోవాట్ వరకు: రూ.500
- 1–5 కిలోవాట్లు: కనీస చార్జి రూ.500, ప్రతి కిలోవాటుకు రూ.600
- 5–20 కిలోవాట్లు: కనీస చార్జి రూ.2,900, ప్రతి కిలోవాటుకు రూ.1,500
- 20 కిలోవాట్లకు మించి: ప్రతి కిలోవాటుకు రూ.10,000
అపార్ట్‌మెంట్లకు అవసరమైన విద్యుత్ లైన్లు వేయడం, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయడం డిస్కమ్‌ల బాధ్యతేనని టీజీఈఆర్‌సీ స్పష్టం చేసింది.
