టెక్సాస్‌లో H-1B వీసాలపై గవర్నర్ కీలక ఆదేశాలు
టెక్సాస్:
H-1B వీసా దరఖాస్తులపై టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టెక్సాస్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలు కొత్త H-1B వీసా పిటిషన్లు దాఖలు చేయకుండా వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
టెక్సాస్ వర్క్‌ఫోర్స్ కమిషన్ నుంచి వ్రాతపూర్వక అనుమతి లేకుండా కొత్త H-1B పిటిషన్లు వేయరాదని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు జనవరి 27, 2026 నుంచి అమల్లోకి వచ్చి, మే 31, 2027 వరకు కొనసాగుతాయి.
H-1B వీసాల దుర్వినియోగం జరుగుతోందని, “అమెరికన్ ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలి” అనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ గ్రెగ్ అబాట్ కుండబద్దలు కొట్టారు.
ఇక H-1B వీసా రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి తీవ్ర నిరాశ ఎదురవుతోంది. ఇప్పటికే సాధారణ వీసా అప్లికేషన్లకు ఇంటర్వ్యూ వెయిటింగ్ పీరియడ్ ఏడాది వరకు ఉండగా, తాజా పరిణామాలతో H-1B వీసా రెన్యువల్ ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ కోసం 2027 వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
మన దేశంలోని యూఎస్ కాన్సులేట్లలో భారీగా పేరుకుపోయిన అప్లికేషన్ బ్యాక్‌లాగ్‌లు ఇందుకు ప్రధాన కారణంగా మారాయి.
వీసా రెన్యువల్ కోసం భారత్‌కు వచ్చి అమెరికాకు తిరిగి వెళ్లలేక ఎదురుచూస్తున్న టెకీలపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతోంది. పరిస్థితి త్వరగా మెరుగయ్యే అవకాశం లేదని ఇమిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు. అందుకే అమెరికాలో ప్రస్తుతం H-1B వీసాతో ఉన్నవారు వీసా స్టాంపింగ్ కోసం భారత్‌కు వెళ్లవద్దని సూచిస్తున్నారు.
స్టాంపింగ్ కోసం భారత్‌కు వచ్చిన కొందరి ఇంటర్వ్యూలు ఇప్పటికే రద్దయ్యాయని, జనవరి–ఫిబ్రవరిలో అపాయింట్మెంట్లు ఉన్నవారికీ తేదీలు మార్చి 2027లోకి షిఫ్ట్ చేస్తూ మెయిల్స్ పంపుతున్నారని సమాచారం.
