విజయవాడలో జోరుగా పందేల బరులు.. గోదావరి జిల్లాల్ని తలపించే పరిస్థితి
విజయవాడ: మూడు రోజులపాటు జరిగే సంక్రాంతి పండగ వచ్చిందంటే ఆ సందడే వేరు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ముందుగానే సంక్రాంతి పండగ హడావుడి కనిపిస్తోంది. గోదావరి జిల్లాలను తలపించేలా నగర శివారులో కోడి పందేలు, పొట్టేల పందేల బరులు సిద్ధమవుతున్నాయి. వేలమంది పందేలను వీక్షించేలా నిర్వాహకులు భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రధాన రహదార్లకు సమీపంలోని తోటలు, ఖాళీ లేఅవుట్లలో పందేల బరులు ఏర్పాటు చేస్తున్నారు. మహిళలు, చిన్నారులు ఇళ్ల వద్ద పండగ జరుపుకుంటే.. పురుషులు కోడి పందేలు, పొట్టేల పందేల కోసం వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. చట్టబద్ధం కాకపోయినా తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయంగా ఈ పందేలు సాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో భారీ బరుల్లో ఒకేసారి 4 నుంచి 5 వేల మంది కూర్చునేలా వేదికలను సిద్ధం చేస్తున్నారు. నిర్వాహకులు జారీ చేసిన టోకెన్లు ఉన్నవారికే లోపలికి అనుమతి ఇస్తుండగా, వారికి శీతల పానీయాలు, భోజన సదుపాయాలు కల్పించనున్నారు.
కోడిపందేల బరులతోపాటు ఎగ్జిబిషన్లు, మహిళల కోసం ముగ్గుల పోటీలు, చిన్నారుల కోసం జెయింట్ వీల్స్ వంటి వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. పిండివంటలతో ప్రత్యేక ఫుడ్‌కోర్టులు సిద్ధం చేస్తున్నారు. క్రీడా మైదానంలా కుర్చీలతో గ్యాలరీలు ఏర్పాటు చేసి వేదికను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. రంగురంగుల అలంకరణలతో పందేల బరులు కొత్త హంగులు సంతరించుకున్నాయి.
