కామారెడ్డిలో హైటెన్షన్: కాంగ్రెస్–బీజేపీ నేతల ఘర్షణ, కార్ల ధ్వంసం
కామారెడ్డి: ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూములు, అరోరా కాలేజీ భూములు, శిశు మందిర్ పాఠశాల స్థలాల వివాదం నేపథ్యంలో కామారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ నేతలు పరస్పరం సవాళ్లు–ప్రతిసవాళ్లు విసురుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ క్రమంలో చర్చకు సిద్ధమని ప్రకటించిన కాంగ్రెస్ నేతలు బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకోగా ఉద్రిక్తత చెలరేగింది. ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి కారును ధ్వంసం చేశారు. అలాగే ఇతర కాంగ్రెస్ నేతల వాహనాలపై కూడా దాడి చేసి బీభత్సం సృష్టించారు.
బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టగా, పరిస్థితి అదుపుతప్పేలా మారింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను అడ్డుకుని చెదరగొట్టి పరిస్థితిని నియంత్రించారు.
ఏం జరిగిందంటే:
కామారెడ్డి డిగ్రీ కాలేజీ భూముల వ్యవహారంలో తనపై కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలకు సాక్ష్యాలతో రావాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి శుక్రవారం ప్రకటించారు. శనివారం ఉదయం 10 గంటలకు స్థానిక శిశు మందిర్ వద్దకు తాను స్వయంగా వస్తానని తెలిపారు. ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు, భూముల నుంచి లబ్ధి పొందిన సంస్థల ప్రతినిధులు, అధికారులు కూడా హాజరుకావాలని కోరారు. నిజానిజాలు నిర్ధారించేందుకు సాక్ష్యాలతో రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ ప్రకటనకు స్పందించిన కాంగ్రెస్ నాయకులు కూడా చర్చకు వస్తామని తెలిపారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత కామారెడ్డిలో కాంగ్రెస్–బీజేపీ మధ్య రాజకీయ వేడి పెరిగింది. విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు ఒకే చోటకు రానున్నట్లు సమాచారం రావడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఉద్రిక్తత చెలరేగి ఘర్షణకు దారితీసింది.
