‘హోప్ ఫర్ లైఫ్’.. పేద విద్యార్థుల హ్యాపీ లైఫ్
రామదుర్గంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ లైబ్రరీ
పోటీ పరీక్షల్లో సత్తాచాటి ప్రభుత్వ కొలువు సాధించాలని ఉన్నా ప్రతి నెలా డబ్బు కోసం ఇంట్లో అడగలేని వారికి.. ప్రతిభ ఉన్నా ఉన్నత చదువు ఆపేస్తున్న పేద విద్యార్థులకు అండగా నిలుస్తోంది హైదరాబాద్‌కు చెందిన ‘హోప్ ఫర్ లైఫ్’ ఫౌండేషన్. 7 వేల మందికిపైగా విద్యార్థులను చదివిస్తున్న ఈ సంస్థ.. భవిష్యత్తులో ఈ సంఖ్య 7 లక్షలకు చేరాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. నల్గొండ జిల్లా చండూరు మండలం లక్కినేనిగూడేనికి చెందిన హిమజ చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరంగా బాలసదన్‌లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతరం డిగ్రీ పూర్తి చేసిన కొన్నాళ్లకు అదే బాలసదనం నుంచి వచ్చిన ఓ ఫోన్‌కాల్ ఆమె ఆలోచనను మార్చింది.
ఇద్దరు అమ్మాయిలకు ఫీజు కట్టడం వీలవుతుందా అని నిర్వాహకులు అడగ్గా అప్పటి ఆమె ఆర్థిక పరిస్థితి మేరకు ఒకరి బాధ్యతను తీసుకున్నారు. తర్వాత మరో ఇద్దరి బాధ్యతను తీసుకున్నారు. ఇలా ముగ్గురు అమ్మాయిలను దత్తత తీసుకోవడంతో మొదలైన ప్రయాణం హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ స్థాపన వరకు సాగింది. ఈ సంస్థ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 7,132 మంది విద్యార్థులను చదివిస్తోంది. ఇందులో 90% అనాథలు, 10% ఒంటరి తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నవారున్నారు. ఉన్నత విద్యకు సాయం అందించిన 18 మందిలో ఏడుగురు ప్రభుత్వ, 11 మంది ప్రైవేటు కొలువులు సాధించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి హాస్టల్ ఫీజులు, స్టడీ మెటీరియల్ ఖర్చులను ఈ ఫౌండేషన్ భరిస్తోంది.
గ్రామీణ ప్రాంతాల్లో పఠనాసక్తి పెంచేలా, యువత పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యేలా సంస్థ ఆధ్వర్యంలో కమ్యూనిటీ లైబ్రరీలను ప్రారంభిస్తున్నారు. 2018లో మహబూబ్‌నగర్ జిల్లా చిన్న ధన్వాడలో తొలి గ్రంథాలయాన్ని.. 2019లో హైదరాబాద్‌లోని చర్లపల్లిలో రెండోది.. ఇటీవల ఏపీలోని నంద్యాల జిల్లా డోన్ మండలం రామదుర్గంలో మూడో గ్రంథాలయాన్ని ప్రారంభించారు. త్వరలో నిజామాబాద్ జిల్లాలో గ్రంథాలయం ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వివరించారు.
