సంక్షేమానికి భారీ కేటాయింపులు… 2026–27 బడ్జెట్‌పై ప్రభుత్వ ఫోకస్
హైదరాబాద్:
ప్రజా సంక్షేమ పథకాలకు నిధుల సర్దుబాటుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ రూపకల్పనలో పింఛన్లు, ఆరు గ్యారెంటీలకు భారీగా నిధులు కేటాయించే దిశగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అమలవుతున్న పథకాల పనితీరును నిశితంగా పరిశీలిస్తూనే, పెరుగుతున్న లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా బడ్జెట్ అంచనాలను అధికారులు రూపొందిస్తున్నారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం అమలు చేయడమే లక్ష్యంగా సంక్షేమ రంగానికి పెద్దపీట వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిధుల కొరత అన్న మాటే రాకుండా ఉండేందుకు ముందస్తుగానే ఆదాయ వనరులను పక్కాగా అంచనా వేసుకుంటూ, ఏ పథకానికీ బ్రేకులు పడకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
బడ్జెట్ రూపకల్పన ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది. మున్సిపల్ ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే ఈ నెల 16 నుంచి డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో శాఖలవారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై సమగ్ర సమీక్ష నిర్వహించనున్నారు. ప్రతి శాఖ అవసరాలు, గత ఏడాది ఖర్చుల వివరాలను కూలంకషంగా చర్చించి, కొత్త కేటాయింపులను అక్కడికక్కడే ఖరారు చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక మార్చి తొలి వారంలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ఆరు గ్యారెంటీలకు సరిపడా నిధులు
ప్రస్తుత 2025–26 ఆర్థిక సంవత్సరంలో పింఛన్ల కోసం రూ.14,861 కోట్లు కేటాయించగా, ప్రస్తుతం ఇస్తున్న రూ.2,000 పెన్షన్‌కు అదనంగా మరో రూ.500 పెంచి ప్రతినెలా చెల్లించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో అదనంగా సుమారు రూ.3,000 కోట్లు అవసరం అవుతాయని అంచనా.
ఇందిరమ్మ ఇండ్ల పథకానికి గత బడ్జెట్లో రూ.12,571 కోట్లు కేటాయించగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తాన్ని 30 శాతానికిపైగా పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం (మహాలక్ష్మి), గృహజ్యోతి పథకం, రైతులకు మేలు చేసే సన్నవడ్ల బోనస్ వంటి కార్యక్రమాలకు కూడా బడ్జెట్ కేటాయింపులను మరింత పెంచేలా ప్లాన్ చేస్తోంది.
పథకాల అమలులో వేగం పెంచడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా నిధుల పెంపుపై ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది.
