ప్రాణాంతక ఫంగస్‌కు బ్రేక్… మెటబాలిక్ స్విచ్‌ను గుర్తించిన హైదరాబాద్ సీసీఎంబీ శాస్త్రవేత్తలు
హైదరాబాద్ : వైరస్‌లు, బ్యాక్టీరియాలే కాదు… ఇప్పుడు ఫంగస్ కూడా మందులకు లొంగకుండా మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. అయితే ఈ ప్రాణాంతక ఫంగస్‌ను కట్టడి చేసే కీలక మార్గాన్ని హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫంగస్ మనిషి శరీరంలో దాడి చేయడానికి దాని ఆహార గ్రహణ ప్రక్రియ (మెటబాలిజం)తో నేరుగా సంబంధం ఉందని, ఆ ‘మెటబాలిక్ స్విచ్’ను ఆఫ్ చేస్తే ఫంగస్‌ను సులభంగా అంతం చేయవచ్చని వారు నిరూపించారు.
డాక్టర్ శ్రీరామ్ వరాహన్ నేతృత్వంలోని బృందం ఈ కీలక పరిశోధన ఫలితాలను శనివారం వెల్లడించింది. ఇప్పటివరకు ఫంగస్ రూపం మారడానికి దాని జన్యువులే కారణమని శాస్త్రవేత్తలు భావించారు. కానీ సీసీఎంబీ పరిశోధకులు అసలు కారణం వేరేనని గుర్తించారు.
రూపం మార్చుకోవడంలోనే ఫంగస్ బలం
ఫంగస్ రెండు రూపాల్లో ఉంటుంది. ఒకటి ఈస్ట్ (గుండ్రని ఆకారం), రెండోది ఫిలమెంటస్ (పొడవాటి దారాల్లాంటి ఆకారం). ఇది మనిషి శరీరంలోకి ప్రవేశించినప్పుడు గుండ్రని ఆకారంలో రక్తంలో ప్రయాణిస్తుంది. ఒక చోట స్థిరపడిన తర్వాత నెమ్మదిగా ఫిలమెంటస్ రూపంలోకి మారి కణజాలంలోకి చొచ్చుకుపోయి ఇన్ఫెక్షన్‌ను తీవ్రతరం చేస్తుంది. ఈ దశలో ఇమ్యూన్ సిస్టమ్ కూడా దీన్ని సరిగా గుర్తించలేకపోవడంతో మందులు పనిచేయడం కష్టమవుతుంది.
షుగర్ అరుగుదలే అసలు కీ
ఫంగస్ తీసుకునే షుగర్‌ను అది ఎంత వేగంగా అరిగించుకుంటుంది (గ్లైకాలైసిస్) అనే అంశంపైనే దాని రూపం ఆధారపడి ఉంటుందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు తేల్చారు. షుగర్ బ్రేక్‌డౌన్ సమయంలో సల్ఫర్ కలిగిన కొన్ని అమైనో యాసిడ్స్ విడుదలవుతాయి. ఇవే ఫంగస్ రూపం మారడానికి స్విచ్‌లా పనిచేస్తాయని గుర్తించారు. ఈ షుగర్ అరుగుదల ప్రక్రియను నెమ్మదిపరిస్తే ఫంగస్ తన ప్రమాదకరమైన రూపంలోకి మారలేకపోయింది. ఫలితంగా అది హాని చేయని గుండ్రని ఆకారంలోనే ఉండిపోయింది.
ఎలుకలపై ప్రయోగం సక్సెస్
ఈ సిద్ధాంతాన్ని నిరూపించేందుకు కాండిడా ఆల్బికాన్స్ అనే ఫంగస్‌పై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఫంగస్‌లో షుగర్‌ను అరిగించే ఎంజైమ్‌ను తొలగించి ఎలుకలపై ప్రయోగించగా, అది ఎలుకల రోగనిరోధక కణాలైన మ్యాక్రోఫేజెస్‌తో పోరాడలేకపోయింది. దీంతో ఇన్ఫెక్షన్ గణనీయంగా తగ్గిపోయింది. అంటే ఫంగస్ రూపం మార్చుకునే శక్తిని దెబ్బకొడితే మన ఇమ్యూన్ సిస్టమ్ దానిని సులభంగా ఎదుర్కోగలదని ఈ పరిశోధన స్పష్టం చేసింది.
ఈ మెటబాలిక్ మార్గాలను లక్ష్యంగా చేసుకుని కొత్త మందులు అభివృద్ధి చేస్తే, భవిష్యత్తులో ఫంగల్ ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా నియంత్రించవచ్చని డాక్టర్ శ్రీరామ్ వరాహన్ తెలిపారు.
