Hyderabad: పెళ్లంటూ దగ్గరై.. రూ.40 లక్షలు కొట్టేశాడు
మనోవేదనతో అనారోగ్యానికి గురైన బాధితురాలు
హైదరాబాద్: జాగ్రత్తగా లేకపోతే ఏ రూపంలోనైనా సైబర్ మోసానికి గురయ్యే అవకాశం ఉందని డీజీపీ బి.శివధర్‌రెడ్డి అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రాష్ట్రంలో 6 వారాలపాటు నిర్వహించనున్న ‘ఫ్రాడ్ కా ఫుల్‌స్టాప్’ అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ఒక యువతి (30) సైబర్ మోసగాడి బారిన పడి నష్టపోయి తనకు ఫిర్యాదు చేసిందన్నారు. ‘సామాజిక మాధ్యమంలో ఆమెకు ఒక యువకుడితో స్నేహం కుదిరింది. ఆమెకు నెలకు రూ.1.20 లక్షల జీతం వస్తుందని తెలుసుకున్న అతను తమది సంపన్న కుటుంబమంటూ నమ్మించాడు. కుటుంబ సభ్యులకూ పరిచయం చేశాడు. బుద్ధిమంతుడిగా నటించాడు. పెళ్లి చేసుకుందామని చెప్పి లోబరుచుకున్నాడు. ఆమె పేరుతో లోన్‌యాప్‌ల నుంచి రూ.40 లక్షలు తీసుకొని ఖర్చు చేశాడు. డబ్బు గురించి అడిగితే ఆస్తులమ్మి ఇస్తానంటూ వాయిదా వేస్తూ వచ్చాడు. తట్టుకోలేని ఆ అమ్మాయి 30 ఏళ్లకే అధిక రక్తపోటు, మధుమేహం బారిన పడింద’ని వివరించారు.
