LatestTelangana

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో హైదరాబాద్ అట్టడుగు… ఓటర్ల లెక్కే ఈసీకి పెద్ద టాస్క్

హైదరాబాద్:
రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికారులు నిర్వహిస్తున్న ఓటర్ల మ్యాపింగ్‌లో హైదరాబాద్ నగరం అట్టడుగున నిలిచింది. రాష్ట్ర సగటు మ్యాపింగ్ 53 శాతంగా నమోదవుతే, భాగ్యనగరం కేవలం 28 శాతంతో చివరి స్థానంలో ఉంది. 2002 నాటి పాత ఓటర్ల జాబితా, ప్రస్తుత 2025 జాబితాల మధ్య సరిపోలిక లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు.

క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌వోలు) ఇంటింటికీ వెళ్లి వెరిఫికేషన్ చేస్తున్నప్పటికీ, నగరాల్లో చాలామంది ఓటర్ల వివరాలు లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఓటర్ల ఖచ్చిత సంఖ్యను నిర్ధారించడం ఎన్నికల కమిషన్‌కు ఇప్పుడు ఒక పెద్ద సవాలుగా మారింది.


పల్లె ముందు… పట్నం వెనక

ఓటర్ల వెరిఫికేషన్ విషయంలో గ్రామీణ ప్రాంతాలు ముందంజలో ఉండగా, పట్టణాలు వెనకబడుతున్నాయి. సిద్దిపేట జిల్లా 80 శాతం మ్యాపింగ్‌తో రాష్ట్రంలో టాపర్‌గా నిలిచింది. రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాలు కూడా 70 శాతానికి పైగా మ్యాపింగ్ పూర్తి చేసి ఆదర్శంగా నిలిచాయి.

అయితే ఐటీ హబ్‌లుగా పేరున్న మేడ్చల్ జిల్లా కేవలం 30 శాతం, రంగారెడ్డి జిల్లా 44 శాతం మ్యాపింగ్‌తో నత్తనడకన సాగుతున్నాయి. వరంగల్, సంగారెడ్డి జిల్లాల్లోనూ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదని అధికారులు చెబుతున్నారు. అద్దె ఇళ్ల మార్పులు, ఉద్యోగాలు–చదువుల కారణంగా నిరంతర వలసలు జరగడం వల్ల వివరాల సేకరణ కష్టంగా మారిందని క్షేత్రస్థాయి సిబ్బంది వాపోతున్నారు.

బస్తీలు, కాలనీల్లో ఓటర్ల జాడ కోసం బీఎల్‌వోలు స్థానిక పెద్దలు, కాలనీ సంఘాల ప్రతినిధుల సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పట్టణ ఓటర్ల ఉదాసీనత కూడా ఈ ప్రక్రియ మందగించడానికి కారణమవుతోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.


40 శాతానికి పైగా ఓటర్ల మ్యాపింగ్ అసంపూర్తి

తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం మొత్తం 3.39 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అయితే వీరిలో 40 శాతానికి పైగా ఓటర్ల మ్యాపింగ్ సరిగా జరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 2002 ఓటర్ల జాబితాలో ఉన్న దాదాపు కోటిన్నర మందికి పైగా వివరాలు ఇప్పటికీ ప్రస్తుత జాబితాతో సరిపోలడం లేదని తెలుస్తోంది.

ఉమ్మడి ఏపీ కాలంలో చివరిసారిగా చేపట్టిన ఆ సర్వే వివరాలను తాజా సమాచారంతో అనుసంధానం చేయడం క్లిష్టంగా మారింది. ముఖ్యంగా చనిపోయిన వారి పేర్లు తొలగించడం, చిరునామా మారిన వారిని గుర్తించడం పెద్ద సవాలుగా మారిందని అధికారులు చెబుతున్నారు.


డైరెక్ట్–ప్రోజెనీ మ్యాపింగ్ విధానం

2002 ఓటర్లను 2025 జాబితాతో పోల్చే క్రమంలో రెండు విధానాలను అధికారులు అనుసరిస్తున్నారు. ఒకటి డైరెక్ట్ మ్యాపింగ్, రెండోది ప్రోజెనీ (వారసత్వ) మ్యాపింగ్ విధానం. ఈ ప్రక్రియలో బీఎల్‌వోలు ప్రతి 250 మంది ఓటర్లను ఒక యూనిట్‌గా తీసుకుని వెరిఫికేషన్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఈ మ్యాపింగ్ పూర్తయితేనే ఓటర్ల జాబితాలోని అసంబద్ధతలు తొలగిపోతాయని అధికారులు భావిస్తున్నారు.


బీఎల్‌వోల నానా తంటాలు

దొంగ ఓట్లకు చెక్ పెట్టేందుకు ప్రోజెనీ మ్యాపింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. 2025 జాబితాలో పేరు ఉండి, 2002 జాబితాలో లేని ఓటర్ల పూర్వీకుల వివరాలను పరిశీలిస్తున్నారు. వారి తల్లిదండ్రులు లేదా తాత–ముత్తాతల వివరాలను పాత జాబితాలో వెతికి అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల ఓటరు స్థానికతపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు.

అయితే నగరాల్లో చిరునామాల అస్పష్టత వల్ల వివరాల సేకరణకు బీఎల్‌వోలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కాలనీ సంఘాలు, బస్తీ పెద్దలను అడిగి సమాచారం సేకరిస్తున్నా ఫలితం ఆశించిన స్థాయిలో రావడం లేదని అధికారులు అంగీకరిస్తున్నారు. ఓటర్ల జాబితాలో పారదర్శకత కోసమే ఈ కసరత్తు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.


దేశవ్యాప్త ఓటర్ల జాబితాతో చెక్

ఇప్పటివరకు ఓటర్ల తనిఖీలు రాష్ట్ర పరిధికే పరిమితమై ఉండగా, ఇప్పుడు దేశవ్యాప్తంగా తనిఖీ చేసే విధానాన్ని అమలు చేస్తున్నారు. ‘ఎరోనెట్’ ప్లాట్‌ఫామ్ ద్వారా ఒక ఓటరుకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఓటు హక్కు ఉందో లేదో సులభంగా గుర్తించనున్నారు. డూప్లికేట్ ఓట్లు, రెండు చోట్ల ఓటు ఉన్నవారిని ఆన్‌లైన్ ద్వారానే గుర్తించి తొలగించవచ్చు.

ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన ఓటర్ల వివరాలనూ ఈ సిస్టమ్ ద్వారా ధ్రువీకరిస్తారు. దీంతో ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉండే అవకాశమే ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.


ఏప్రిల్–మేలో సర్ ప్రారంభం

రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఏప్రిల్ లేదా మే నెలలో ప్రారంభం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అధికారిక నోటిఫికేషన్ వెలువడగానే పూర్తి స్థాయి కసరత్తు మొదలవుతుందని అధికారులు తెలిపారు. అప్పటిలోగా రాజకీయ పార్టీలు తమ బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలని సీఈవో సూచించారు. బీఎల్‌వోలకు పార్టీల ఏజెంట్లు సహకరిస్తే మ్యాపింగ్ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.

ప్రస్తుతం జరుగుతున్నది కేవలం ముందస్తు సన్నాహక తనిఖీలేనని, ఏప్రిల్ నాటికి మ్యాపింగ్ సమస్యలన్నింటిని అధిగమించి పక్కా ఓటర్ల జాబితాను సిద్ధం చేయడమే లక్ష్యమని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.

Cyber Post

About Cyber Post Cyber Post is a leading online news portal based in Hyderabad, dedicated to delivering accurate, timely, and trustworthy news to readers across India and beyond. Guided by our tagline — “News You Can Trust” — we are committed to upholding the highest standards of journalism in an era of rapid digital transformation and information overload. At Cyber Post, our mission is simple yet powerful: to inform, inspire, and empower our audience with credible reporting, insightful analysis, and unbiased coverage. Our team of experienced journalists and digital media professionals work around the clock to bring you the latest updates from politics, business, technology, entertainment, sports, and current affairs — all presented with integrity and clarity. Founded in Hyderabad, the city’s dynamic spirit of innovation and diversity inspires our approach to journalism. Whether it’s breaking news, investigative reports, or community stories, Cyber Post stands as a trusted source for truth in the digital age. With a growing readership and a reputation for credibility, Cyber Post continues to redefine digital news by blending traditional journalistic values with modern storytelling and technology. Cyber Post – News You Can Trust.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *