అసెంబ్లీ ఎన్నికల తర్వాత నేతల వలసల ప్రభావం
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు అభ్యర్థుల కొరత
యాదాద్రి: పదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన బీఆర్‌ఎస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల కొరత వెంటాడుతోంది. యాదాద్రి జిల్లాలో కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు ఆశావహులు పోటెత్తుతుంటే, బీఆర్‌ఎస్ తరపున పోటీ చేయడానికి పలువురు నేతలు వెనకంజ వేస్తున్న పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన అనంతరం పరిస్థితిని అంచనా వేసి తమ అభ్యర్థులను ఎంపిక చేయాలని బీఆర్‌ఎస్ ‘వెయిట్ అండ్ సీ’ విధానాన్ని అనుసరిస్తోంది.
పంచాయతీ ఎన్నికల ఫలితాలతో నిరాశ
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. గెలుస్తామనుకున్న పంచాయతీలు చేజారిపోవడంతో పార్టీ నేతలు, క్యాడర్‌లో నిరాశ నెలకొంది. ఈ నేపథ్యంలో రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో అయినా ఎక్కువ వార్డులతో పాటు చైర్మన్ సీట్లు కైవసం చేసుకోవాలని పార్టీ ప్రయత్నిస్తోంది.
అయితే, అధికారంలో ఉన్న సమయంలోనే 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆలేరు, భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీలను మాత్రమే బీఆర్‌ఎస్ గెలుచుకోగా, మోత్కూరు మున్సిపాలిటీ డ్రా పద్ధతిలో దక్కింది. చౌటుప్పల్, యాదగిరిగుట్ట, భువనగిరి మున్సిపాలిటీల్లో మెజారిటీ కౌన్సిలర్లు గెలవకపోవడంతో అక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎక్స్‌అఫిషియో ఓటర్లుగా నమోదు చేయాల్సి వచ్చింది.
చైర్మన్ పదవులపై రాజకీయ మలుపులు
భువనగిరి, చౌటుప్పల్, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో ఎక్స్‌అఫిషియో ఓట్లు వేసినా ఫలితం దక్కే పరిస్థితి లేకపోవడంతో భువనగిరిలో ఓ బీజేపీ కౌన్సిలర్, చౌటుప్పల్‌లో సీపీఎం కౌన్సిలర్ల సహకారంతో బీఆర్‌ఎస్ చైర్మన్ సీట్లు దక్కించుకుంది. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో చౌటుప్పల్, యాదగిరిగుట్ట చైర్మన్లు కాంగ్రెస్‌లో చేరారు. మోత్కూరులో అవిశ్వాసం కారణంగా బీఆర్‌ఎస్ చైర్మన్ పదవి కోల్పోయి, కాంగ్రెస్ కౌన్సిలర్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
పోటీకి వెనకడుగు
2023 అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆర్‌ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు కాంగ్రెస్‌లో చేరడంతో మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ క్యాడర్ బలహీనపడినట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ తరపున టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొనగా, బీఆర్‌ఎస్ తరపున పోటీ చేసేందుకు ఉత్సాహం తగ్గింది. అధికారంలో ఉన్నప్పుడే మెజారిటీ రాకపోవడం, ఎక్స్‌అఫిషియో ఓట్లతో చైర్మన్ పదవులు దక్కించుకున్న అనుభవాలు నేతలను ఆలోచనలో పడేస్తున్నాయి.
‘వెయిట్ అండ్ సీ’ వ్యూహం
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యాకే తమ అభ్యర్థులను ప్రకటించాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్‌లో టికెట్ దక్కని అసంతృప్తులు బీఆర్‌ఎస్ వైపు వచ్చే అవకాశం ఉందన్న అంచనాతో ఆచితూచి అడుగులు వేస్తోంది. అలాగే కాంగ్రెస్ ఎంపిక చేసిన అభ్యర్థి కులాన్ని దృష్టిలో పెట్టుకుని అదే కులానికి చెందిన వ్యక్తిని బీఆర్‌ఎస్ అభ్యర్థిగా నిలబెట్టాలన్న వ్యూహాన్ని అమలు చేయాలని పార్టీ యోచిస్తోంది.
మున్సిపాలిటీల్లో చైర్మన్ సీట్లు సాధించి క్యాడర్‌ను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ ప్రస్తుతం రాజకీయంగా జాగ్రత్త అడుగులు వేస్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
