పెట్రోల్, డీజిల్ కొరతపై పుకార్లు… స్పష్టత ఇచ్చిన ఇండియన్ ఆయిల్
గల్ఫ్ దేశాలపై ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో భారత్‌లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని జరుగుతున్న ప్రచారంపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ స్పష్టత ఇచ్చింది. దేశంలో ఇంధన కొరత లేదని, ఈ విషయంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా పుకార్లేనని కంపెనీ వెల్లడించింది.
ఇటీవల గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా భారత్‌లో ఇంధన సరఫరా దెబ్బతింటుందని, త్వరలోనే పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ స్పందిస్తూ దేశవ్యాప్తంగా ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపింది.
పెట్రోల్ బంక్‌ల వద్ద ఎలాంటి కొరత లేదని, సాధారణంగా సరఫరా కొనసాగుతోందని కంపెనీ పేర్కొంది. ప్రజలు పుకార్లను నమ్మి అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయవద్దని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఇండియన్ ఆయిల్ అధికారులు సూచించారు.
దేశంలో ఇంధన సరఫరా వ్యవస్థ బలంగా ఉందని, పరిస్థితులను ప్రభుత్వం మరియు ఆయిల్ కంపెనీలు నిరంతరం సమీక్షిస్తున్నాయని తెలిపారు. గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు ఎలా ఉన్నా దేశానికి అవసరమైన ఇంధనాన్ని సరఫరా చేసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఇండియన్ ఆయిల్ వెల్లడించింది.
