Indigo Crisis: 500కి.మీ వరకు రూ.7500: విమాన టికెట్ ధరలు నిర్ణయించిన కేంద్రం
ఇంటర్నెట్‌డెస్క్: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో అంతరాయం వల్ల ప్రయాణికులు గమ్యస్థానాలు చేరుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితిని కొన్ని విమానయాన సంస్థలు ఆసరాగా తీసుకోవడంతో టికెట్ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. తాము టికెట్ల కోసం అధిక ధరలు చెల్లించినట్లు పలువురు ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ అవకాశవాద ధరల పెంపు విషయం తన దృష్టికి రావడంతో శనివారం కేంద్రం రంగంలోకి దిగింది. ప్రయాణికులను అధిక ఛార్జీల భారం నుంచి రక్షించేందుకు చర్యలు చేపట్టింది. ధరల నియంత్రణను తీసుకువచ్చామని, వాటిని పాటించాలని ఆదేశించినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది (Indigo Crisis).
ఎకానమీ క్లాస్‌లో కి.మీ.వారీగా గరిష్ఠ ఛార్జీలు ఇలా..
- 500కి.మీ వరకు – రూ.7,500
- 500-1000కి.మీ – రూ.12,000
- 1000-1500కి.మీ – రూ.15,000
- 1500కి.మీ.దాటితే – రూ.18,000
‘‘అంతరాయాల సమయంలో అసాధారణంగా ఛార్జీలను పెంచడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ తరహా అవకాశవాద ప్రవర్తన నుంచి ప్రయాణికులను రక్షించేందుకు చర్యలు చేపడుతున్నాం. ప్రభావిత మార్గాల్లో న్యాయబద్ధమైన ఛార్జీలను నిర్ధరించేందుకు మంత్రిత్వశాఖ తన నియంత్రణ అధికారాలను ఉపయోగించుకుంది. కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకునేవరకు కొత్తగా సూచించిన పరిమితులను కచ్చితంగా పాటించాలి. వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయిన నేపథ్యంలో సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, వైద్యసహాయం అందాల్సిన ప్రయాణికులు సీట్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ధరలపై నియంత్రణ ఉండేలా, దోపిడీని నిరోధించాల్సిన అవసరం ఉంది’’ అని మంత్రిత్వశాఖ వెల్లడించింది.ఆర్సీఎస్-యూడీఏఎన్ (RCS-UDAN) విమానాలు, బిజినెస్ క్లాస్‌కు ఈ ఛార్జీలు వర్తించవని కేంద్రం వెల్లడించింది. ధరల స్థిరీకరణ జరిగేవరకు లేక తదుపరి సమీక్ష జరిగేవరకు ఈ పరిమితులు అమల్లో ఉంటాయని వెల్లడించింది.
ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పేర్కొంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) అధికారులతో సమీక్ష జరిపిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. ఎయిర్‌లైన్స్, ట్రావెల్ ప్లాట్‌ఫామ్స్‌పై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టిపెట్టడంతో ఎప్పటికప్పుడు ధరలపై పర్యవేక్షణ ఉంటుందని అధికారులు వెల్లడించారు. కరోనా సమయంలోనూ కేంద్రం ఇలా ధరల పరిమితిని విధించింది.
పెండింగ్ రీఫండ్స్‌ను వెంటనే చెల్లించాలి: కేంద్రం
ఎలాంటి జాప్యం లేకుండా పెండింగ్‌లో ఉన్న రీఫండ్లను వెంటనే చెల్లించాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. రద్దయిన, ఆలస్యమవుతోన్న విమాన సర్వీసులకు సంబంధించి రీఫండ్ ప్రక్రియను ఆదివారం రాత్రి 8 గంటల కల్లా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. రద్దు కారణంగా ఇప్పటికే ప్రభావితమైన ప్రయాణికులపై రీ షెడ్యూలింగ్ ఛార్జీలు విధించకూడదని తన ఆదేశాల్లో పేర్కొంది. ప్రయాణికుల లగేజీలను 48 గంటల్లో ఎవరివి వారికి అప్పగించాలని వెల్లడించింది. ఈ రీఫండ్ ప్రక్రియలో జాప్యం చేసినా లేక ఆదేశాలను బేఖాతరు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించింది.
గత కొన్ని రోజులుగా వందల సంఖ్యలో ఇండిగో(Indigo) సర్వీసులు రద్దవుతున్న సంగతి తెలిసిందే. శనివారం కూడా పలు ఎయిర్‌పోర్టుల్లో వందలకు పైగా దేశీయ సర్వీసులు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో దిల్లీ ఎయిర్‌పోర్టు ప్రకటన విడుదల చేసింది. సర్వీసుల పునరుద్ధరణ జరుగుతోందని, అయితే కొన్ని సరీసులపై ప్రభావం కొనసాగుతోందని వెల్లడించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు రైల్వే కూడా రంగంలోకి దిగింది. కొన్ని రైళ్లకు అదనపు బోగీలను జోడించడంతో పాటు, ప్రత్యేకంగా రైళ్లను కూడా నడుపుతోంది.
