గూగుల్‌లో మరోసారి అంతర్గత అలజడి
అమెరికా భద్రతా విభాగాల ఒప్పందాలకు వ్యతిరేకంగా వెయ్యి మంది ఉద్యోగుల పిటిషన్
‘హింస, నిఘాకు మా టెక్నాలజీ వాడొద్దు’ – గూగుల్ ఉద్యోగుల డిమాండ్
అమెరికా దిగ్గజ టెక్ సంస్థ గూగుల్‌లో మరోసారి అంతర్గత అలజడి మొదలైంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE), కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) వంటి అమెరికా ప్రభుత్వ విభాగాలతో గూగుల్‌కు ఉన్న ఒప్పందాలను వ్యతిరేకిస్తూ దాదాపు వెయ్యి మంది ఉద్యోగులు గళమెత్తారు.
“Google Demands: Worker Safety & ICE Contract Transparency” పేరుతో రూపొందించిన పిటిషన్‌పై సంతకాలు చేసి, తమ నిరసనను కంపెనీ మేనేజ్‌మెంట్ దృష్టికి తీసుకెళ్లారు. గూగుల్ సాంకేతికత హింస, నిఘా, అణచివేతకు సాధనంగా మారుతోందని ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ పిటిషన్‌లో ముఖ్యంగా గూగుల్ క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సరిహద్దు ప్రాంతాల్లో నిఘా వ్యవస్థలను బలోపేతం చేయడానికి, వలసదారులను ట్రాక్ చేసే ‘పాలంటీర్ ఇమ్మిగ్రేషన్ ఓఎస్’ వంటి వ్యవస్థలకు గూగుల్ క్లౌడ్ కీలకంగా పనిచేస్తోందని ఉద్యోగులు ఆరోపించారు. కేత్ పోర్టర్, రెనీ గుడ్, అలెక్స్ ప్రెట్టి వంటి వారి మరణాలకు కారణమైన హింసాత్మక వాతావరణానికి గూగుల్ టెక్నాలజీ పరోక్షంగా ఆజ్యం పోస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేవలం క్లౌడ్ సేవలే కాకుండా, గూగుల్ జనరేటివ్ ఏఐని కూడా ప్రభుత్వ విభాగాల సామర్థ్యాన్ని పెంచేందుకు వినియోగిస్తున్న అంశంపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యూట్యూబ్‌లో ICE రిక్రూట్‌మెంట్ ప్రకటనలు ప్రసారం కావడం, అలాగే ఇమ్మిగ్రెంట్ల రక్షణ కోసం రూపొందించిన ట్రాకింగ్ యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగించడం వంటి చర్యలను వారు తీవ్రంగా తప్పుబట్టారు.
“ఈ టెక్నాలజీలను రూపొందిస్తున్న ఉద్యోగులుగా, మా శ్రమ హింసాత్మక చర్యలకు ఉపయోగపడటం మమ్మల్ని భయపెడుతోంది” అని పిటిషన్‌లో పేర్కొన్నారు.
డిమాండ్ల విషయంలో ఉద్యోగులు స్పష్టంగా ఉన్నారు.
ప్రభుత్వ విభాగాలతో గూగుల్‌కు ఉన్న అన్ని ఒప్పందాలను బహిర్గతం చేయాలని, తక్షణమే ఈ కొలాబరేషన్ల నుంచి గూగుల్ తప్పుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఏఐ ప్రమేయం లేకుండా, కంపెనీ ఉన్నత నాయకత్వంతో ప్రత్యక్షంగా ఎమర్జెన్సీ Q&A సెషన్ నిర్వహించాలని కోరారు.
అలాగే కేఫ్టీరియా కార్మికుల నుంచి డేటా సెంటర్ ఉద్యోగుల వరకు అందరికీ భద్రత కల్పించేలా వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాలు, చట్టపరమైన మద్దతు వంటి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గూగుల్ తన ఉత్పత్తులు ప్రభుత్వ అణచివేతకు ఉపయోగపడకుండా ఖచ్చితమైన పరిమితులు విధించాలని ఉద్యోగులు గట్టిగా కోరుతున్నారు.
