ఇంట్లోకి ఎండ వస్తేనే రూ.80 వేల అద్దెనా? బెంగళూరులో వైరల్ అయిన ‘సన్‌లైట్ ఫ్లాట్’ కథ
బెంగళూరు: ఇల్లు అంటే వెలుతురు, గాలి, ఎండ సరిగా రావాలి. అది పూరిల్లు అయినా, గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్ అయినా ఇదే సాధారణ అంచనా. కానీ ఇప్పుడు అదే “స్పెషల్ ఫీచర్”గా మారి భారీ అద్దెకు కారణమవుతుందా? ఇదే ప్రశ్న ఇప్పుడు Bengaluruలో హాట్ టాపిక్‌గా మారింది.
ఐటీ ఉద్యోగం కోసం ఇటీవల బెంగళూరుకు వచ్చిన ఓ మహిళ 2BHK అపార్ట్మెంట్ కోసం వెతుకుతోంది. ఈ క్రమంలో ఓ బ్రోకర్ ఆమెను సంప్రదించి నెలకు రూ.80 వేల అద్దె చెప్పాడు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్‌కు ఇంత అద్దె ఎందుకని అడగగా, అతను ఇచ్చిన సమాధానం ఆమెను షాక్‌కు గురిచేసింది.
“మేడమ్… ఈ ఫ్లాట్‌కు ఉదయం, సాయంత్రం సూర్యరశ్మి బాగా వస్తుంది. ఇంట్లోకి గాలి బాగా ప్రవహిస్తుంది. బాల్కనీ ఉంది. అందుకే అద్దె రూ.80 వేలు,” అని చెప్పాడట. దానికి ఆమె, “వెలుతురు రాని ఇంటిని ఇల్లు అంటారా?” అంటూ స్పందించిందట. “ఇక్కడ ఇలాగే ఉంటుంది” అని బ్రోకర్ సమాధానం చెప్పినట్లు ఆమె సోషల్ మీడియాలో వెల్లడించింది.
ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. నెటిజన్లు తమ అనుభవాలను పంచుకుంటూ కామెంట్లతో నింపేశారు. కొందరు వ్యంగ్యంగా స్పందించారు.
ఒకరు, “Koramangalaలో గేటెడ్ కమ్యూనిటీలో 2BHKకి రూ.70 వేలు. కానీ రూ.80 వేల ఫ్లాట్‌కు సూర్యరశ్మి బోనస్‌గా వస్తుందట!” అంటూ కామెంట్ చేశారు.
మరికొందరు బెంగళూరులో ఇంటి యజమానుల అత్యాశపై విమర్శలు గుప్పించారు. “ఇంటి అద్దె చెల్లించాలంటే ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి,” అని ఒకరు పేర్కొన్నారు. “ఇంత అద్దె ఇస్తున్నా రోడ్లు బాగోలేవు, డ్రైనేజీ సమస్యలు, క్లీన్ అండ్ గ్రీన్ లేదు… గత్యంతరం లేక ఉంటున్నాం,” అంటూ మరో నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఏదేమైనా, ఇంట్లోకి ఎండ, గాలి, వెలుతురు రావడం వంటి సాధారణ విషయాలు కూడా ఇప్పుడు అద్దె పెంపుకు కారణమవుతున్నాయన్న చర్చ వేడెక్కింది. “రాబోయే రోజుల్లో గాలి వచ్చే ఇల్లు కూడా వింతగా మారొచ్చు,” అంటూ నెటిజన్లు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.
