ఇరాన్‌పై ఇజ్రాయెల్ మెరుపు దాడులు.. ఉద్రిక్తతల తారస్థాయి
టెల్ అవీవ్: ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడుల పరంపర కొనసాగుతోంది. ఊపిరి పీల్చుకునే విరామం ఇవ్వకుండా బాంబులు, మిస్సైళ్లతో వరుస దాడులు చేస్తోంది. మంగళవారం (మార్చి 3) కూడా ఇరాన్ అంతటా పేలుళ్లు వినిపిస్తున్నట్లు స్థానిక మీడియా తెలిపింది.
ఇరాన్ దక్షిణ నగరం బుషెహర్ లోని విమానాశ్రయం, ఎయిర్‌బేస్‌పై ఇజ్రాయెల్ మెరుపు దాడులు జరిపిందని సమాచారం. తూర్పు టెహ్రాన్ లోని హకీమిహ్ ప్రాంతం కూడా ఈ దాడుల్లో దెబ్బతింది. అలాగే టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఇక్కడితో ఆగని ఇజ్రాయెల్, కోమ్ లోని ఇరాన్ నిపుణుల మండలి (Assembly of Experts) భవనంపై కూడా దాడి చేసినట్లు సమాచారం. ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఉన్న అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత కొత్త సుప్రీం నాయకుడిని ఎన్నుకునే బాధ్యత ఈ మండలికే ఉంది. మంగళవారం ఖమేనీ వారసుడి ఎంపికకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
ఆ సమయంలో కౌన్సిల్‌లోని 88 మంది సభ్యుల్లో ఎంతమంది భవనంలో ఉన్నారు? ఎంత ప్రాణనష్టం జరిగింది? అన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఒక ఇజ్రాయెల్ అధికారి ప్రకారం, కొత్త సుప్రీం నాయకుడి ఎంపికను అడ్డుకోవడమే ఈ దాడి లక్ష్యమని పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్‌పై దాడులు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగుతోంది. ఖమేనీ మరణానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా మిత్రదేశాలైన గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది.
ఇజ్రాయెల్–అమెరికా–ఇరాన్ పరస్పర దాడులతో మిడిల్ ఈస్ట్ ప్రాంతం బాంబులు, మిస్సైళ్ల మోతతో దద్దరిల్లుతోంది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
