ఏఐ భయంతో కుప్పకూలిన ఐటీ షేర్లు.. ఇన్ఫోసిస్‌కు 30 నెలల చెత్త రోజు
న్యూఢిల్లీ/ముంబై:
ఇండియన్ టాప్ ఐటీ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్‌కు స్టాక్ మార్కెట్లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం జరిగిన ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఇన్ఫోసిస్ షేర్లు ఏకంగా 7.3 శాతం వరకు పతనమై, గత 30 నెలల్లోనే అత్యంత చెత్త రోజును నమోదు చేశాయి. NSEలో ఇన్ఫోసిస్ షేరు ధర 1,534 రూపాయల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ ఒక్కరోజు పతనంతోనే ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ.49 వేల కోట్ల వరకు తగ్గినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
ఇన్ఫోసిస్ ఒక్కటే కాదు… మొత్తం భారతీయ ఐటీ రంగం అమ్మకాల ఒత్తిడిలో విలవిల్లాడింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఏకంగా 6.35 శాతం నష్టపోయింది. దీంతో ఐటీ షేర్లలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎల్టీఐ మైండ్‌ట్రీ, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వంటి అగ్రశ్రేణి ఐటీ కంపెనీల షేర్లు కూడా 5 నుంచి 8 శాతం వరకు కుప్పకూలాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఐటీ షేర్ల పరిస్థితి కూడా ఇదేలా ఉండటంతో మొత్తం రంగం నష్టాల ఊబిలో చిక్కుకుంది.
ఈ భారీ పతనానికి ప్రధాన కారణంగా అమెరికాకు చెందిన ఏఐ దిగ్గజ సంస్థ ‘ఆంత్రోపిక్’ తాజాగా విడుదల చేసిన కొత్త ఏఐ టూల్స్‌ను మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ‘క్లాడ్’ చాట్‌బాట్ కోసం ఆంత్రోపిక్ తీసుకొచ్చిన కొత్త ప్లగ్-ఇన్లు లీగల్, సేల్స్, మార్కెటింగ్, డేటా అనాలిసిస్ వంటి కీలక పనులను చాలా తక్కువ ఖర్చుతో పూర్తిగా ఆటోమేట్ చేయగలవని కంపెనీ ప్రకటించింది. ఇప్పటివరకు ఈ పనుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ సంస్థలు సాఫ్ట్వేర్ సర్వీస్ కంపెనీలకు భారీగా చెల్లింపులు చేసేవి. ఇప్పుడు అదే పని ఏఐ ద్వారానే వేగంగా, తక్కువ ఖర్చుతో పూర్తవుతుండటంతో సంప్రదాయ ఐటీ సర్వీస్ కంపెనీల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది.
మరోవైపు, అమెరికా మార్కెట్లలో నాస్డాక్ భారీగా పతనమవడం కూడా భారత ఐటీ షేర్లపై ప్రభావం చూపింది. గ్లోబల్ టెక్ స్టాక్స్‌పై ఒత్తిడి పెరగడంతో విదేశీ పెట్టుబడిదారులు ఐటీ షేర్లను అమ్ముకునే దిశగా అడుగులు వేశారు. దీంతో ఒక్కరోజులోనే భారత మార్కెట్లో ఐటీ రంగానికి భారీ నష్టాలు తప్పలేదు.
రానున్న రోజుల్లో ఏఐ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెంది, మానవ శ్రమ అవసరం లేకుండానే సాఫ్ట్వేర్ సంబంధిత పనులు పూర్తయ్యే అవకాశాలు పెరుగుతున్నాయనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఇది ఐటీ కంపెనీల సంప్రదాయ బిల్లింగ్ మోడల్, సబ్స్క్రిప్షన్ ఆదాయాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న భయాలు ఇన్వెస్టర్లను వెంటాడుతున్నాయి.
మొత్తం మీద ఏఐ విప్లవం ఒకవైపు టెక్నాలజీ రంగానికి కొత్త అవకాశాలు తెస్తున్నప్పటికీ, మరోవైపు ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీల మార్కెట్ విలువను గట్టిగా దెబ్బతీస్తూ, భవిష్యత్తుపై ప్రశ్నార్థకంగా మారుతోందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
