జగిత్యాల: కోరుట్ల బస్టాండ్లో బుర్కా వేసుకున్న వ్యక్తి అదుపులో
జగిత్యాల జిల్లా కోరుట్లలో గత రాత్రి 8 గంటల సమయంలో అనుమానాస్పద ఘటన చోటుచేసుకుంది. బుర్కా ధరించి బస్టాండ్లో మహిళల పక్కన కూర్చున్న వ్యక్తిని ప్రయాణికులు అనుమానించారు.
బుర్కా వేసుకున్న వ్యక్తి పురుషుడని గుర్తించిన ప్రయాణికులు వెంటనే ఆర్టీసీ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో బస్టాండ్లోని ఆర్టీసీ భద్రతా సిబ్బంది అతనిపై నిఘా పెట్టారు. ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో అతని గొంతు మగ వ్యక్తిదిగా గుర్తించి సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం డిపో మేనేజర్ ద్వారా స్థానిక పోలీసులకు అప్పగించారు.
ప్రాంక్ వీడియో కోసం ఇలా చేశాడా? లేక ఆకతాయి చేష్టలతో మహిళల మధ్య కూర్చుని ఇబ్బందులకు గురి చేశాడా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసం మహిళలను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
