ప్రైవేట్ ఉద్యోగుల భద్రతకు పెన్షన్ పథకం తీసుకొచ్చింది కాకా వెంకటస్వామి: మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్:
ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగుల భద్రత కోసం పెన్షన్ పథకాన్ని తన తండ్రి గుడిసెల వెంకటస్వామి తీసుకువచ్చారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి తెలిపారు. హైదరాబాద్‌లోని నాంపల్లి తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ భవన్‌లో నిర్వహించిన తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కలిసి డైరీని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, తన తండ్రి స్ఫూర్తితోనే గిగ్ వర్కర్స్ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చామని చెప్పారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆ చట్టాన్ని అమలు చేసి, గిగ్ వర్కర్ల భద్రత కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కనీస వేతనాలను పెంచలేదని విమర్శించిన మంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వేతనాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రైవేట్ ఉద్యోగుల పాత్ర కీలకమని, ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తుందని తెలిపారు. ప్రైవేట్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రితో చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ, మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతోనే గిగ్ వర్కర్స్ చట్టం వచ్చిందని అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. అలాగే బ్లూ కాలర్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం మరింత చొరవ చూపాలని కోదండరాం విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
