కాళేశ్వరం కమీషన్లకే పేదోడి గూడు విస్మరించారు: మంత్రి పొంగులేటి
అశ్వారావుపేట :
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మిస్తే భారీ కమీషన్లు వస్తాయన్న ఆశతో గత ప్రభుత్వం పేదోడి గూడును పూర్తిగా విస్మరించిందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను పేదలకు అందజేశామని స్పష్టం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మంత్రి పొంగులేటి మాట్లాడారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, మాటలకే పరిమితం కాకుండా హామీలను కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ సెంటర్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ… గత ప్రభుత్వం వరి వేస్తే ఉరేనని రైతులను భయపెట్టిందని, అయితే ఇందిరమ్మ ప్రభుత్వంలో వరి సాగు చేసిన రైతులకు రూ.500 బోనస్ అందించామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను అమలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే 26 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని మంత్రి వెల్లడించారు. అలాగే ప్రతి నియోజకవర్గానికి రూ.200 కోట్లతో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసినట్లు తెలిపారు.
కొత్తగా ఏర్పడిన అశ్వారావుపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అశ్వారావుపేట అభివృద్ధికి గాను రూ.7 కోట్లతో మున్సిపాలిటీ నూతన భవనం, రూ.5 కోట్లతో దొంతికుంట చెరువు ఆధునికీకరణ చేపట్టనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా మార్కెట్ కాంప్లెక్స్, టాయిలెట్లు, సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు.
అశ్వారావుపేటకు మినీ బస్ డిపోను మంజూరు చేయడంతో పాటు, ఆ పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకపల్లి వీరభద్రరావు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న, జూపల్లి రమేశ్, శశికళ, దమ్మపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, తుమ్మా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
