Kamal Haasan-Rajinikanth: రజనీ-కమల్ మూవీ.. యువ డైరెక్టర్‌కు ఛాన్స్
ఇంటర్నెట్ డెస్క్: అగ్ర కథానాయకుడు రజనీకాంత్ 173వ చిత్రానికి (Rajini 173) సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. ప్రముఖ నటుడు కమల్ హాసన్ నిర్మాణ సారథ్యంలో రానున్న ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశం యువ డైరెక్టర్ శిబి చక్రవర్తికి లభించింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ శనివారం ఓ ఫొటోను షేర్ చేసింది. ‘ప్రతి హీరోకు ఓ ఫ్యామిలీ ఉంటుంది’ అని రాసుకొచ్చింది. (Rajinikanth 173 Movie update)
కమల్ (Kamal Haasan) సొంత నిర్మాణసంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఈ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అనిరుధ్ స్వరాలు సమకూరుస్తున్నారు. 2027 సంక్రాంతికి ఈ మూవీని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
అంతకుముందు ఈ సినిమాకు సుందర్.సి దర్శకత్వం వహిస్తున్నట్లు ప్రకటన వెలువడింది. అయితే, అనుకోని కారణాల వల్ల దర్శకత్వ బాధ్యతల నుంచి సుందర్ వైదొలిగారు. దీంతో కొత్త డైరెక్టర్ ఎవరై ఉంటారా? అని ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే రజనీని డైరెక్ట్ చేసే అవకాశం శిబి చక్రవర్తికి లభించింది. ఈ యువ దర్శకుడు 2022లో తీసిన డాన్ తమిళ మూవీ బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
