ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
త్వరలో మరిన్ని అరెస్టులు… బీఆర్ఎస్ పెద్దల తరఫున వసూళ్లపై సిట్ ఫోకస్
హైదరాబాద్: రాష్ట్రాన్ని కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన వారితో పాటు, బీఆర్ఎస్ పెద్దల తరఫున వసూళ్లు, సెటిల్మెంట్లకు పాల్పడిన పలువురు వ్యక్తులను త్వరలో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలో కేసీఆర్‌కు సన్నిహితుడిగా పేరున్న సంతోష్‌రావు పేరు ప్రధానంగా వినిపిస్తోంది.
ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఇప్పటికే పక్కా ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 2 వేలకుపైగా టెక్నికల్ ఎవిడెన్స్‌ను సేకరించిన సిట్, ట్యాపింగ్ లిస్టులో ఉన్న 618 ఫోన్ నంబర్లకు సంబంధించి దాదాపు 300 మందికిపైగా స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. ట్యాపింగ్‌కు అనుమతులు ఇచ్చిన మాజీ సీఎస్‌లు, రివ్యూ కమిటీలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, బ్లాక్‌మెయిలింగ్‌కు గురైన వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రత్యర్థులు, ఇతర ప్రముఖుల వాంగ్మూలాలు ఇందులో ఉన్నాయి.
ట్యాపింగ్ ద్వారా రికార్డ్ చేసిన ఆడియో క్లిప్పులు, వాట్సాప్ చాటింగ్ స్క్రీన్షాట్లు, ఇతర డిజిటల్ ఎవిడెన్స్‌తో పాటు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు కూడా దర్యాప్తులో కీలకంగా మారాయి. కేసు ప్రారంభ దశలో పలువురు పోలీస్ అధికారులను అరెస్ట్ చేసిన సిట్, కొంతకాలంగా విచారణకే పరిమితమైంది. అయితే తాజా ఆధారాలతో త్వరలో మరో విడత అరెస్టులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అదనపు చార్జ్‌షీట్ దాఖలుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఎస్ఐబీ – ఎస్వోటీ నిధులపై దృష్టి
ఎస్ఐబీ కేంద్రంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్స్ (ఎస్వోటీ) టీమ్‌కు నిధుల కేటాయింపుపై సిట్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. 2019 సెప్టెంబర్ 8 నుంచి 2023 వరకు హరీశ్‌రావు ఫైనాన్స్ మంత్రిగా ఉన్న సమయంలో, ఎస్వోటీ విభాగంలో ఫోన్ ట్యాపింగ్‌కు అవసరమైన పరికరాలు కొనుగోలు చేసినట్లు ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఈ అంశాలపై హరీశ్‌రావును విచారణలో సిట్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
అలాగే ఎన్నికల సమయంలో సిద్ధిపేట నియోజకవర్గంలో ప్రత్యర్థుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం, నగదు పట్టివేతలకు సంబంధించిన వివరాలు, బాధితుల వాంగ్మూలాలను కూడా సిట్ రికార్డ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా బీఆర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్లు వచ్చినట్లు సిట్ గుర్తించినట్లు సమాచారం. ఇందుకోసం రియల్టర్లు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తల ఫోన్ నంబర్లను ట్యాపింగ్ లిస్టులో చేర్చినట్లు తేల్చింది.
ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ పెద్దల తరఫున మధ్యవర్తిత్వం వహించిన సంతోష్‌రావుతో పాటు పలువురు ప్రైవేట్ వ్యక్తులు వ్యాపారవేత్తల నుంచి వసూళ్లు, సెటిల్మెంట్లకు పాల్పడినట్లు పక్కా ఆధారాలు సేకరించినట్లు అధికారులు చెబుతున్నారు. వీరిని అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలు రాబట్టాలని సిట్ భావిస్తోంది.
ముగ్గురి స్టేట్మెంట్లపై విశ్లేషణ
గత ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ, లా అండ్ ఆర్డర్ వ్యవహారాలు పూర్తిగా సీఎం కేసీఆర్ ఆధీనంలోనే ఉండేవని సిట్ గుర్తించింది. అప్పట్లో ఇంటెలిజెన్స్ ఐజీగా పని చేసిన ప్రభాకర్‌రావును పదవీ విరమణ అనంతరం తిరిగి ఎస్ఐబీ చీఫ్‌గా నియమించడం, సిటీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావుకు రెండేళ్ల పొడిగింపు ఇవ్వడంపై సిట్ లోతుగా విచారించింది.
ఈ నియామకాల వెనుక ఉన్న కారణాలపై కేసీఆర్‌ను ఇటీవల సిట్ ప్రశ్నించింది. ప్రభాకర్‌రావు నియామకానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను సేకరించిన సిట్, ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు కస్టడీలో ఇచ్చిన స్టేట్మెంట్లు, కేసీఆర్ ఇచ్చిన వాంగ్మూలాలను పోల్చి పరిశీలించిన తర్వాత ఈ నియామకాల వెనుక కుట్రకోణం ఉందనే నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ప్రభాకర్‌రావు ఎస్ఐబీ చీఫ్‌గా నియమితులైనప్పటి నుంచి 2023 డిసెంబర్ 4న బేగంపేటలోని ఎస్ఐబీ లాగర్ రూమ్ ధ్వంసం వరకు సంబంధించిన పూర్తి టెక్నికల్ ఎవిడెన్స్‌ను సిట్ సేకరించింది. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న ప్రణీత్‌రావు నేతృత్వంలోని ఎస్వోటీ టీమ్ 618 ఫోన్ నంబర్లను ట్యాప్ చేసినట్లు టెలికం సంస్థల నుంచి అధికారిక రికార్డులు కూడా పొందింది.
అరెస్టులపై తుది నిర్ణయం
కేసీఆర్ విచారణ అనంతరం బుధవారం సిట్ మరోసారి కీలక సమావేశం నిర్వహించింది. సిట్ చీఫ్ సజ్జనార్ నేతృత్వంలో అధికారులు న్యాయనిపుణులతో సమావేశమై, నిందితులు, బాధితులు, సాక్షుల స్టేట్మెంట్లతో పాటు హరీశ్‌రావు, కేటీఆర్, సంతోష్‌రావు, కేసీఆర్ పర్సనల్ ఓఎస్డీ రాజశేఖర్‌రెడ్డి, కేసీఆర్ ఇచ్చిన వాంగ్మూలాలను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం ఫోన్ ట్యాపింగ్ కేసుతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న మరికొందరిని అరెస్ట్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
