Kotak Securities: సాంకేతిక లోపంతో ఖాతాలో రూ.40 కోట్లు.. నిమిషాల్లో రూ.1.75 కోట్ల లాభం
ఇంటర్నెట్ డెస్క్: సాంకేతిక లోపం వల్ల (tech glitch) ఓ ట్రేడర్ ఖాతాలో రూ.40 కోట్లు వచ్చి పడ్డాయి. ఆ డబ్బును అతడు స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టగా 20 నిమిషాల్లో ఏకంగా రూ.1.75 కోట్ల లాభం వచ్చింది. అయితే అనుకోకుండా అతడి ఖాతాలో జమ అయిన తమ డబ్బుతో ట్రేడర్ లాభాలు పొందినట్లు ఆరోపిస్తూ.. కోటక్ సెక్యూరిటీస్ (Kotak Securities) కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఈ వ్యవహారం వైరల్‌గా మారింది.
అసలేమయ్యిందంటే?
2022లో కోటక్ సెక్యూరిటీస్‌లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల ఓ స్టాక్ ట్రేడర్ ఖాతాలో కోటక్‌కు చెందిన రూ.40 కోట్లు జమయ్యాయి. ఈ డబ్బును ట్రేడర్ స్టాక్స్‌లో పెట్టడంతో కేవలం 20 నిమిషాల్లోనే అతడికి రూ.1.75 కోట్ల లాభం వచ్చింది. అనంతరం తమ వ్యవస్థలో తప్పిదాన్ని గుర్తించిన కోటక్ సెక్యూరిటీస్ ట్రేడర్ను సంప్రదించడంతో కొంతకాలం తర్వాత అతడు కోటక్ నుంచి జమ అయిన రూ.40 కోట్లను తిరిగి ఇచ్చాడు. అయితే రూ.40 కోట్లతో పాటు వాటిని స్టాక్స్‌లో పెట్టి ఆర్జించిన రూ.1.75 కోట్ల లాభాన్ని కూడా తమకే ఇవ్వాలని కోటక్ డిమాండ్ చేసింది. అందుకు అతడు అంగీకరించకపోవడంతో ఇరువర్గాలు బాంబే హైకోర్టు (Bombay High Court)ను ఆశ్రయించాయి.
దీనిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం స్టాక్ ట్రేడర్ కోటక్ సెక్యూరిటీస్ (Kotak Securities) నుంచి వచ్చిన డబ్బుతో సంపాదించిన రూ. 1.75 కోట్ల లాభం అతడికే చెందుతుందని తీర్పునిచ్చింది. దీనివల్ల సంస్థకు ఎలాంటి నష్టం కలగలేదని.. ఇది అన్యాయంగా సంపాదించిన డబ్బు కూడా కాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ట్రేడర్ సొంత రిస్క్‌పై స్టాక్స్‌లో పెట్టినందువల్ల లాభం కూడా అతడికే సొంతమవుతుందని తెలిపింది. విచారణలో భాగంగా ట్రేడర్ తమ డబ్బుతో సంపాదించిన మొత్తాన్ని తమకు ఇచ్చేస్తే అతడికి రూ.50 లక్షలు ఇస్తామని కోటక్ సెక్యూరిటీస్ ఆఫర్ ఇవ్వగా అందుకు అతడు తిరస్కరించాడు. ఈ కేసుపై తదుపరి విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా వేస్తున్నట్లు బాంబే హైకోర్టు వెల్లడించింది.
