టెలిమెట్రీల బాధ్యత నుంచి కేఆర్ఎంబీ తప్పింపు? రాష్ట్రాలదేనంటూ లేఖ
హైదరాబాద్: కృష్ణా నది జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతున్న వేళ, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (KRMB) వైఖరి మరోసారి చర్చనీయాంశమైంది. కేటాయింపులకు మించి నీటిని పొరుగు రాష్ట్రం తీసుకెళ్తున్నా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా టెలిమెట్రీ వ్యవస్థల నిర్వహణ తమ బాధ్యత కాదంటూ రెండు రాష్ట్రాలకు బోర్డు లేఖ రాయడం వివాదానికి దారి తీసింది.
రెండు రాష్ట్రాల మధ్య నీటి వినియోగాన్ని పర్యవేక్షించేందుకు టెలిమెట్రీ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. మొత్తం 31 ప్రాంతాల్లో టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, తొలి దశలో 2016లో 18 చోట్ల టెలిమెట్రీలు ఏర్పాటు చేశారు. అయితే వాటిలో ఎక్కువ భాగం తెలంగాణ ప్రాంతాల్లోనే ఉన్నాయి.
రెండో దశలో అత్యంత కీలకమైన పోతిరెడ్డిపాడు, నాగార్జునసాగర్ కుడి కాల్వ వంటి ప్రాంతాల్లో టెలిమెట్రీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.4.30 కోట్లు నిధులు కూడా విడుదల చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ తన వంతు నిధులు ఇవ్వకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదని అధికారులు చెబుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో టెలిమెట్రీల నిర్వహణ బాధ్యత తమది కాదని పేర్కొంటూ బోర్డు తాజాగా రెండు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ ఈఎన్‌సీలు, సంబంధిత అధికారులకు లేఖ రాసింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తమకు కేవలం నీటి పంపకాల నియంత్రణ బాధ్యత మాత్రమే ఉందని బోర్డు పేర్కొంది. వాటర్ అకౌంట్స్ తయారు చేయడం, నీటి వినియోగ లెక్కలు నిర్వహించడం రాష్ట్రాల బాధ్యతేనని స్పష్టం చేసింది.
రాష్ట్రాలు అందించే డేటా ఆధారంగా బోర్డు కేవలం ఒక రెగ్యులేటర్‌గా మాత్రమే వ్యవహరిస్తుందని పేర్కొంది. అలాగే 2021 జూలై 15న కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావాల్సి ఉన్నప్పటికీ, ఆ అంశం ప్రస్తుతం కోర్టులో ఉండటంతో నేరుగా నియంత్రణ చేపట్టలేమని తెలిపింది.
ఇదిలా ఉండగా, రెండో దశ టెలిమెట్రీల ఏర్పాటు విషయంలో తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు బోర్డుకు లేఖలు రాసినప్పటికీ స్పందన లేదని విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ఇచ్చిన నిధులను బోర్డు వినియోగించినప్పటికీ, ఏపీపై మాత్రం ఒత్తిడి తీసుకురాలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇటీవల రెండు నెలల్లో ఏపీ తన కోటాకు మించి నీటిని తీసుకెళ్తోందని తెలంగాణ ప్రభుత్వం నాలుగు లేఖలు రాసినప్పటికీ బోర్డు నుంచి స్పష్టమైన చర్యలు కనిపించలేదని ఇరిగేషన్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు టెలిమెట్రీల నిర్వహణ బాధ్యత నుంచి కూడా బోర్డు తప్పుకోవడం పరోక్షంగా ఏపీకి సహకరించడమేనా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అంతేకాకుండా తొలి దశలో ఏర్పాటు చేసిన టెలిమెట్రీలన్నీ తెలంగాణ ప్రాంతాల్లోనే ఉండటం, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో లేకపోవడం కూడా ఆందోళన కలిగిస్తున్న అంశంగా మారింది. ఈ పరిస్థితుల్లో టెలిమెట్రీల నిర్వహణను రాష్ట్రాలకే అప్పగిస్తే నీటి వినియోగంపై పారదర్శకత ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
