KTR: సంపద కొందరి చేతుల్లోనే ఉంటే.. ‘ఇండిగో’ తరహా పరిస్థితులే: కేటీఆర్
హైదరాబాద్: అధికారం ఒకరిద్దరి చేతుల్లోనే కేంద్రీకృతమైతే ఇప్పుడు దేశంలోని విమానాశ్రయాల్లో నెలకొన్న పరిస్థితే ఉత్పన్నమవుతుందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. పైలట్లను దోపిడీ చేయొద్దని కేంద్రం గతేడాది చెప్పినా.. విమానయాన సంస్థలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోలేదని, అందుకే ఇప్పుడు ఇండిగో కార్యకలాపాల్లో సమస్యలు ఏర్పడ్డాయని అన్నారు. ఇండిగో వెనక్కి తగ్గలేదుగానీ, కేంద్రం తన ఆదేశాలను ఉపసంహరించుకుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో నిర్వహించిన ట్రేడ్ యూనియన్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పైలట్ల విషయంలో ఏడాది క్రితమే డీజీసీఏ షరతులు విధించిందని అన్నారు. ‘‘ దేశంలో విమానాలన్నీ టాటా, ఇండిగో చేతుల్లోనే ఉన్నాయి. ఐదు రోజుల తర్వాత కేంద్రమే వెనక్కి తగ్గింది. తాను ఇచ్చిన ఆదేశాలను తానే వెనక్కి తీసుకుంది. సంపద మొత్తం కొందరి చేతుల్లోనే ఉంటే ఇలాంటి పరిస్థితులే వస్తాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండాలి. అది కూడా నాణ్యతతో ఉండాలి’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
