మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 10, 11న స్థానిక సెలవులు – జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో జరగనున్న 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలు – 2026 నేపథ్యంలో స్థానిక సెలవులు ప్రకటించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, భూపాలపల్లి మున్సిపాలిటీలో ఫిబ్రవరి 11, 2026 (బుధవారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ నేపథ్యంలో, పోలింగ్ జరిగే పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు ఫిబ్రవరి 11న ప్రజా సెలవు ప్రకటించినట్లు తెలిపారు.
అలాగే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు, సేవలకు అంతరాయం కలగకుండా ఆలస్యంగా కార్యాలయానికి హాజరు కావడం లేదా ముందుగానే వెళ్లే వెసులుబాటు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
ఇదే విధంగా, పోలింగ్ నిర్వహణ కోసం వినియోగించనున్న ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థల భవనాలు తదితరాలకు ఫిబ్రవరి 10, 2026 (మంగళవారం) నాడు స్థానిక సెలవు ప్రకటించినట్లు తెలిపారు.
ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ప్రజలు, అధికారులు, ఎన్నికల సిబ్బంది అందరూ సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ విజ్ఞప్తి చేశారు.
