MGNREGA: ‘ఉపాధి’ స్థానంలో కొత్త చట్టం.. G RAM G పేరుతో కేంద్రం బిల్లు

దిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (MGNREGA) రద్దు చేసేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీని స్థానంలో గ్రామీణులకు ఉపాధి కోసం కొత్త చట్టం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన బిల్లు (New Rural Employment Law) ప్రతులను సోమవారం లోక్‌సభ సభ్యులకు అందించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని 2005లో తీసుకొచ్చారు. ఇప్పుడు దాన్ని రద్దు చేసి కొత్తగా.. వికసిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) (VB-G RAM G) బిల్లు, 2025ను తీసుకురానున్నట్లు సమాచారం. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణాభివృద్ధిని సాధించే దిశగా ఈ కొత్త పథకాన్ని రూపొందించినట్లు బిల్లులో పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి సంవత్సరంలో 125 రోజుల పాటు వేతనంతో కూడిన ఉపాధికి హామీని ఇవ్వడంతో పాటు సంపన్న, సుస్థిర గ్రామీణ భారత్‌ను సాధించడం వంటి లక్ష్యాలను కొత్త చట్టంలో ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలాఉండగా.. ఇటీవలే గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును.. పూజ్య బాపు గ్రామీణ్ రోజ్‌గార్ యోజనగా మార్చిన సంగతి తెలిసిందే. అలాగే పనిదినాల సంఖ్యను 100 నుంచి 125కి పెంచింది. ఒక రోజుకు ఇచ్చే కనీస వేతనాన్ని రూ.240కి సవరించింది. పల్లె ప్రాంత నిరుపేదలకు ఉపాధి కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిర ఆస్తుల కల్పన, వనరుల ఉత్పాదకత, అభివృద్ధి లక్ష్యాలుగా దాదాపు రెండు దశాబ్దాల కిందట ‘ఎన్‌ఆర్‌ఈజీఏ’ చట్టాన్ని 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. తర్వాత 2009లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంగా పేరు మార్చారు.
