ఖమ్మంలో మైక్‌లు బంద్.. మనీ పంపకాలే జోరు
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
ఖమ్మం:
జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలతో మైక్‌లు బంద్ కానున్నాయి. వారం, పది రోజులుగా గల్లీ గల్లీ వినిపించిన మైక్‌లు, డీజేల హోరుకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. అయితే ప్రచారం ముగిసేలోపే ఓటర్లను ఆకట్టుకునే తాయిలాల పంపకాలు మాత్రం జోరందుకున్నాయి.
ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు మద్యం, చికెన్, స్వీట్ ప్యాకెట్లు మాత్రమే కాకుండా చీరలు, జాకెట్ పీసులు, బొట్టు బిళ్లల ప్యాకెట్లు, పార్టీ గుర్తులతో కూడిన కీచైన్లు వంటి వస్తువులను కూడా పంపిణీ చేస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్‌తో పాటు ఏడు మున్సిపాలిటీల్లోని పలు వార్డుల్లో నగదు పంపకాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కొన్ని చోట్ల ఓటుకు రూ.2 వేల చొప్పున, మరికొన్ని వార్డుల్లో రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు పంపిణీ చేస్తున్నట్టు సమాచారం.
చివరి రోజు హోరెత్తించడమే ప్లాన్
పది రోజులుగా ఉత్కంఠభరితంగా సాగిన ప్రచారాన్ని చివరి రోజు తారాస్థాయికి తీసుకెళ్లాలని పార్టీల ముఖ్య నేతలు ప్లాన్ చేశారు.
కాంగ్రెస్ నేతలు రెండేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ప్రచారం చేయగా, తమ హయాంలో ప్రారంభించిన పనులనే కాంగ్రెస్ కొనసాగించిందని, కొత్తగా చేసింది ఏమీ లేదని బీఆర్ఎస్ లీడర్లు కౌంటర్ చేస్తున్నారు. విమర్శలు–ప్రతివిమర్శల నడుమ ఇవాళ భారీ ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు సిద్ధమయ్యారు.
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ ఏదులాపురంలో ప్రధాన రహదారుల్లో భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. అలాగే కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జ్గా బాధ్యతలు చూస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చివరి రోజు ఖమ్మం జిల్లాలో ప్రచారానికి హాజరుకానున్నారు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లో ర్యాలీలు, కార్నర్ మీటింగ్స్‌లో ఆయన పాల్గొననున్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా చివరి రోజు సొంత నియోజకవర్గమైన మధిర మున్సిపాలిటీలో ప్రచారం, రోడ్ షో నిర్వహించనున్నారు.
మూడ్రోజుల ముందే పంపకాలు
వైరాలో ఓటర్లకు మూడ్రోజుల ముందే రూ.500 అడ్వాన్స్‌తో పాటు స్వీట్లు, చికెన్, చీరల పంపకాలు మొదలయ్యాయి. క్రమంగా ఈ పంపిణీ వ్యవహారం అన్ని మున్సిపాలిటీలకు విస్తరించింది.
కొన్ని వార్డుల్లో ఓటుకు రూ.500, మరికొన్ని చోట్ల రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏదులాపురంలో కొన్ని ప్రాంతాల్లో రూ.2 వేల చొప్పున పంపిణీ ప్రారంభమైంది.
సీపీఎం, సీపీఐ అభ్యర్థులు బలంగా ఉన్న వార్డుల్లో వారే ముందుగా నగదు పంపకాలు ప్రారంభించడం చర్చనీయాంశంగా మారగా, దానికి పోటీగా కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా రంగంలోకి దిగారు. ఇప్పటివరకు ప్రచారంలో పాల్గొన్న వారికి రూ.400 చొప్పున ఇచ్చి మందు–బిర్యానీతో సరిపెట్టిన క్యాంపెయిన్ ఖర్చులకు ఇవాళ సాయంత్రంతో తెరపడనుంది.
