2028లో జగిత్యాల నుంచి ఎంఐఎం ఎమ్మెల్యే అభ్యర్థి.. అసదుద్దీన్ ఓవైసీ సంచలన ప్రకటన
హైదరాబాద్:
2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గం నుంచి ఎంఐఎం ఎమ్మెల్యే అభ్యర్థిని నిలబెడతామని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం (ఫిబ్రవరి 7) జగిత్యాలలో ఎంఐఎం అభ్యర్థి తరఫున ఓవైసీ ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐదు సంవత్సరాల తర్వాత జగిత్యాలకు వచ్చానని చెప్పారు. జగిత్యాలలో పెండింగ్‌లో ఉన్న ఉర్దూ హౌస్ భవన నిర్మాణ పనులను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే జగిత్యాల గంజ్ ప్రాంతంలో నాలా సమస్య, ఉర్దూ హౌస్ ఏర్పాటు అంశాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని తెలిపారు.
రాజకీయంగా ఏ పార్టీ కూడా ముస్లింలకు సరైన నాయకత్వం ఇవ్వలేదని ఓవైసీ వ్యాఖ్యానించారు. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ కూడా ముస్లిం సమస్యలను పార్లమెంట్‌లో పెద్దగా ప్రస్తావించలేదని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీలోనే సంజయ్, జీవన్ రెడ్డి ఇద్దరూ పరస్పరం కొట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వీరు బీజేపీతో ఎలా పోరాడతారని ప్రశ్నించారు. 2028 ఎన్నికలకు ముందు జీవన్ రెడ్డి లేదా సంజయ్ కేసీఆర్ దగ్గరకు వెళ్తారని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లో ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రచారం చేసినా బీజేపీ గెలవలేదని గుర్తు చేసిన ఓవైసీ, జగిత్యాలలో బీజేపీ ఎలా గెలుస్తుందంటూ ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ దేశంలో మతకలహాలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు.
అంతేకాకుండా దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణలను బీజేపీ ఎందుకు అడ్డుకోలేకపోతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ప్రధాని నరేంద్ర మోడీ తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఓవైసీ ఆరోపించారు.
