మంచిర్యాలలో ఓటు హక్కు వినియోగించిన మంత్రి గడ్డం వివేక్… 85% స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్న ధీమా
మంచిర్యాల, ఫిబ్రవరి 11, 2026:
మంచిర్యాల జిల్లా హైటెక్ సిటీలోని 227వ పోలింగ్ బూత్‌లో రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన నివాసం నుంచి నడుచుకుంటూ వెళ్లి ఓటు వేసిన మంత్రి ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని గుర్తుచేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రభుత్వంలో ఎన్నికలు పూర్తిగా పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల భారంతో నెట్టుకుపోయిందని విమర్శించిన మంత్రి, ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టి సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తోందని చెప్పారు.
ప్రజాపాలనలో ఎక్కడా పోలీసుల ఒత్తిడి లేదని స్పష్టం చేసిన మంత్రి, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీసులను ఉపయోగించి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఘటనలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, బెదిరింపులతో ఎన్నికలు లేకుండా ఏకగ్రీవాల పేరుతో ప్రజలను ఓటు హక్కు వినియోగించకుండా చేసిన సంఘటనలు గతంలో ఉన్నాయని గుర్తు చేశారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి బెదిరింపులు లేకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు బలంగా ఉందని, ఈ ఎన్నికల్లో 85 శాతం కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్య బలపాటుకు ఓటు కీలకమని పేర్కొన్న మంత్రి, ప్రతి ఓటరు తప్పనిసరిగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
