తప్పుడు ప్రచారాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర విచారం
హైదరాబాద్.
మహిళా IAS అధికారులను లక్ష్యంగా చేసుకొని మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు, ఆధారంలేని ప్రచారాలను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కలెక్టర్, IAS అధికారుల బదిలీల్లో మంత్రుల జోక్యం ఉండదని, అలాంటి నిర్ణయాలు పూర్తిగా ముఖ్యమంత్రి పరిధిలో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
IAS ఉద్యోగం సాధించడం అంత ఆషామాషీ కాదని, అటువంటి ఉన్నత స్థాయి అధికారులపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి పేర్కొన్నారు. మహిళా అధికారులను మానసికంగా వేధించే విధంగా వార్తలు ప్రచారం చేయడం అనైతికమని, అన్ని మీడియా యాజమాన్యాలు బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. వాస్తవాలు ఉంటే సంబంధిత ఆధారాలతో తమ దృష్టికి తీసుకురావాలని, కానీ తప్పుడు వార్తలతో వ్యక్తిగత ప్రతిష్ఠలకు భంగం కలిగించవద్దని హితవు పలికారు.
రాజకీయ నాయకులు, IAS అధికారులు, ముఖ్యమంత్రి కార్యాలయం (CMO)లోని మహిళా అధికారులు, ఇంచార్జ్ మంత్రులపై కూడా ఆధారంలేని కథనాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా తనను ‘నల్గొండ మంత్రి’గా చూపుతూ తప్పుడు ప్రచారాలు చేయడం కూడా సరైంది కాదని అన్నారు. ఈ అంశాలపై డీజీపీతో చర్చించామని, సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీజీపీ, ఇంటెలిజెన్స్ అధికారులను కోరినట్లు తెలిపారు. నివేదిక వచ్చిన అనంతరం చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవినే త్యాగం చేశానని, వ్యక్తిగతంగా ఎన్నో బాధలు ఎదుర్కొన్నానని మంత్రి గుర్తు చేశారు. తన కుమారుని కోల్పోయిన బాధను దాచుకుని, ఆయన పేరుతో ప్రజాసేవ చేస్తున్నానని, పేద ప్రజలకు సేవ చేస్తున్న తనపై అసత్య ప్రచారాలు చేయడం అన్యాయమని అన్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ప్రజల ఆశీర్వాదంతో గెలిచానని, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా రికార్డు స్థాయిలో ఎంపీగా గెలిచానని పేర్కొన్నారు. తప్పుడు వార్తలతో తనను మానసికంగా వేధించడం ద్వారా ఏమి సాధిస్తారని ప్రశ్నించారు. తాను దైవభక్తి గలవాడినని, దేవుడిని నమ్ముతానని, చివరికి న్యాయం దేవుడే చూస్తాడని అన్నారు.
