ఖమ్మం జిల్లాలో మంత్రి కొండా సురేఖ పర్యటన
ఖమ్మం:
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్‌చార్జ్‌గా నియమితులైన మంత్రి కొండా సురేఖ ఖమ్మం జిల్లాకు చేరుకుని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఖమ్మం చేరుకున్న మంత్రి కొండా సురేఖ ముందుగా పట్టణంలోని స్థానిక నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికల సన్నాహాలపై నాయకులతో చర్చించి వివరాలు తెలుసుకున్నారు.
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా ఆమె పర్యటనలు చేపట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానం మినహా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో, ఈ మున్సిపల్ ఎన్నికల్లోనూ వంద శాతం విజయాలు సాధిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ మున్సిపల్ ఎన్నికలపై స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఘన విజయం దిశగా నడిపించాలని పిలుపునిచ్చారు.
ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ క్రమంలో ఎదులాపురం, వైరా, మధిర, సత్తుపల్లి, అశ్వరావుపేట, కొత్తగూడెం, ఎల్లందు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు.
ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ, కాంగ్రెస్ పాలనలోనే నిజమైన ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులన్నీ ఐక్యంగా పనిచేసి ఘన విజయం సాధించాలని ఆమె కోరారు.
