ఉచిత టోల్‌పాసుల దుర్వినియోగం.. ‘వీఐపీ’ల పేరుతో వాహనాల ఆగడాలు
పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ
‘ఎవరు పడితే వారు తమ వాహనాల నంబరు ప్లేట్లపై పోలీస్ కమిషనర్, ఎమ్మెల్యేలు అని స్టిక్కర్లు వేయిస్తూ.. సైరన్లు వినియోగిస్తున్నారు. నిబంధనలను అతిక్రమిస్తున్న వారిపై పోలీస్, ఆర్టీవో, ఆర్‌అండ్‌బీ, ట్రాఫిక్ శాఖల ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి..’
ఇటీవల మండలి సమావేశాల్లో సంబంధిత మంత్రులతో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
నల్గొండ: సంక్రాంతి వేళ.. టోల్‌ప్లాజాల వద్ద నిబంధనలను అనధికార ‘వీఐపీ’లు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ఫలానా ప్రజాప్రతినిధులకు చెందిన వాహనమని, ఎమ్మెల్యే, ఎంపీలు, ఎమ్మెల్సీల పేరిట స్టిక్కర్లు వేసుకుని ఈ కారు వారిదేనని బుకాయిస్తున్నారు. టోల్ రుసుములు చెల్లించాలని చెబితే ససేమిరా ఒప్పుకోవడం లేదు. వీరి వల్ల ట్రాఫిక్ రద్దీ మరింత పెరిగిపోతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో సిబ్బంది వదిలేస్తున్నారు. ఇదే అదనుగా కొందరు ప్రభుత్వం కల్పించే ఉచిత టోల్‌గేట్ అనుమతులు కూడా దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. టోల్‌ప్లాజాల వద్ద పోలీస్, అంబులెన్స్ సైరన్స్‌లను వినియోగిస్తుండటంతో తరచూ వాగ్వాదాలు జరుగుతున్నాయి.
ప్రతి శాసనమండలి సభ్యుడికి గతంలో ఐదు స్టిక్కర్లు అందజేస్తే వాటిని మూడింటికి తగ్గించాలనే నిబంధన ఉన్నా అమలు కావడం లేదు. గతంలోనూ శాసనసభ్యుల స్టిక్కర్లు ఉన్న వాహనాలు అనధికార, చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు తరచూ ఫిర్యాదులు వచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.నేడు మరింత ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశాలుండటంతో టోల్ రుసుములను ఎగ్గొట్టేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడే ఇలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికులు ముందుగా పంతంగి టోల్‌గేట్ దాటి అక్కడి నుంచి నార్కట్‌పల్లి, మిర్యాలగూడ మీదుగా అద్దంకి, ఒంగోలు, ప్రకాశం, నెల్లూరు వైపు మొత్తం 10 టోల్‌బూత్‌ల మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. వాహనాలు బారులు తీరిన వేళ..పైరవీల గోల ప్రయాణికులను చికాకు పెట్టిస్తున్నాయి. టోల్‌ప్లాజాల వద్ద వీఐపీ, నకిలీ ప్రజాప్రతినిధుల కార్ల పైరవీల గోల మాత్రం తగ్గడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు.
కేసులు నమోదు చేస్తున్నాం
ప్రజాప్రతినిధులకు సంబంధించిన టోల్‌పాసులు దుర్వినియోగం చేసినా, అనధికారికంగా హారన్‌లు వినియోగించినా నిర్వాహకులు మాకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే పదుల సంఖ్యలో అనధికార వాహనాలు గుర్తించి కేసులు నమోదు చేశాం.
