బహుళ అంతస్తుల ధమాకా.. కోకాపేట నియోపోలిస్‌లో 60 అంతస్తులు దాటి
హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీలో రెండింతల వృద్ధి
బల్దియాలో ఏకంగా 103 భవంతులకు అనుమతి
హైదరాబాద్
మహానగరంలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాల్లో వృద్ధి కన్పిస్తోంది. 2025లో హెచ్‌ఎండీఏలో దాదాపు 94, జీహెచ్‌ఎంసీలో 103 బహుళ భారీ భవంతులకు అనుమతులు ఇచ్చాయి. గతేడాదితో పోల్చితే దాదాపు రెండు రెట్లు ఎక్కువ. హెచ్‌ఎండీఏలో అత్యధికంగా 91.16 లక్షల చదరపు మీటర్ల బిల్టప్ ఏరియాలో నిర్మాణాలు చేపట్టారు. 2024లో ఇది కేవలం 36.5 లక్షల చదరపు మీటర్లే కావడం గమనార్హం.
ఆ వెసులుబాటే కారణం
దేశంలో ముంబయి, దిల్లీ ఇతర మహానగరాల్లో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్‌ఎస్‌ఐ) అమల్లో ఉంది. హైదరాబాద్‌లో మాత్రం నియంత్రణ లేకపోవడం వల్ల భారీ భవంతుల నిర్మాణాలు పెరగడానికి ఓ కారణమని నిపుణులు చెబుతున్నారు. ఎఫ్‌ఎస్‌ఐ వల్ల భారీ భవనాల నిర్మాణంలో వెసులుబాటు తక్కువ. బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలను ఎఫ్‌ఎస్‌ఐ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. భవనాల ఎత్తు, విస్తీర్ణంలో నిర్ణీత నిబంధనలకు లోబడి చేపట్టాలి. హైదరాబాద్‌లో ఎఫ్‌ఎస్‌ఐ విషయంలో ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో భారీ నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి.
60 అంతస్తులు దాటి…
- కోకాపేట నియోపోలిస్‌లో అత్యధికంగా 63 అంతస్తుల వరకు అపార్ట్‌మెంట్లు, ఇతర వాణిజ్య, వ్యాపార సముదాయాలు నిర్మిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 2024లో కేవలం 69 భారీ భవంతులకు అనుమతులు ఇస్తే…అదే 2025 నాటికి ఆ సంఖ్య 103కు దాటింది. ఇతర సాధారణ భవనాలకు సంబంధించి 2381 అనుమతులు ఇచ్చారు. గతేడాదితో పోల్చితే స్వల్పంగా పెరుగుదల ఉంది.
- హెచ్‌ఎండీఏలో 2024లో కేవలం 55 బహుళ అంతస్తులకు మాత్రమే అనుమతులు ఇవ్వగా…ఈసారి 94 భారీ అంతస్తుల భవనాలకు అనుమతులు మంజారు చేశారు.
- పై అంతస్తుల్లో ప్రశాంత వాతావరణం, కాలుష్యం ముప్పు తక్కువగా ఉంటుందనే భావనతో చాలామంది నివసించేందుకు ఇష్టపడుతున్నారు.
తగ్గిన దరఖాస్తుల తిరస్కరణ
ఇటీవలి ప్రభుత్వం ‘బిల్డ్‌నౌ’ సాఫ్ట్‌వేర్ తీసుకొచ్చింది. గత సాఫ్ట్‌వేర్‌లో దరఖాస్తుల అప్‌లోడ్, పరిశీలనలో తీవ్ర జాప్యం జరుగుతుండటం గమనించి వాటిలో మార్పులు చేర్పులు చేసింది. ప్రస్తుతం నిమిషం వ్యవధి లోపే ప్లాన్‌లు, మ్యాపులు అన్ని వివరాలు అప్‌లోడ్ అవుతున్నాయి. పరిశీలనలో కూడా వేగం పెరిగింది. దరఖాస్తు సమయంలో పూర్తి వివరాలు నమోదు చేస్తుండటం వల్ల తిరస్కరణ శాతం తగ్గుతోందని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తుల తిరస్కరణ హెచ్‌ఎండీఏ పరిధిలో 2023లో 18 శాతం, 2024లో 20 శాతం ఉంటే..2025 నాటికి అది 15 శాతానికి తగ్గింది.
