ములుగు/తాడ్వాయి : మేడారం గ్యాంగ్‌రేప్ వైరల్ న్యూస్ ఫేక్ అని తేల్చిన జాతీయ మహిళా కమిషన్
ములుగు/తాడ్వాయి : మేడారంలో బాలికపై గ్యాంగ్‌రేప్ జరిగిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్త పూర్తిగా ఫేక్ న్యూస్ అని జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) స్పష్టం చేసింది. ఓ యూట్యూబ్ చానెల్‌లో ప్రచారంైన ఈ వార్తను సుమోటోగా తీసుకున్న ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్ విజయ రహత్కర్ ఆదేశాలతో ప్రత్యేక ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు చేశారు.
ఈ కమిటీ సభ్యులు డెలినా ఖోంగ్‌డప్, కాంచన్ ఖట్టర్ గురువారం ఢిల్లీ నుంచి ములుగు జిల్లాకు వచ్చి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ముందుగా ములుగు కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎస్పీ డాక్టర్ సుధీర్ రాంనాథ్ కేకన్‌తో సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం తాడ్వాయి మండలంలోని మేడారం ప్రాంతానికి వెళ్లి, గ్యాంగ్‌రేప్ జరిగిందని ప్రచారం అయిన జంపన్నవాగు పరిసరాల మామిడి తోట ప్రాంతాలను పరిశీలించారు.
ఆర్డీఓ వెంకటేశ్ సారథ్యంలో కమిటీ సభ్యులు స్థానికులను విచారించగా, ఎలాంటి ఘటన జరగలేదని తేలింది. పస్రా సీఐ దయాకర్, ఎస్సై కమలాకర్‌ల నుంచి కూడా వివరాలు సేకరించారు. క్షేత్రస్థాయి విచారణలో గ్యాంగ్‌రేప్‌కు సంబంధించిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని కమిటీ నిర్ధారణకు వచ్చింది.
మీడియాతో మాట్లాడిన ఎన్‌సీడబ్ల్యూ సభ్యురాలు డెలినా ఖోంగ్‌డప్ మాట్లాడుతూ, ఓ యూట్యూబ్ చానెల్‌లో వచ్చిన వార్త ఆధారంగానే విచారణకు వచ్చామని, కానీ పరిశీలన తర్వాత అది పూర్తిగా ఫేక్ న్యూస్ అని తేలిందని చెప్పారు. సంబంధిత యూట్యూబ్ చానెల్ వీడియోను తొలగించి క్షమాపణ కూడా చెప్పిందని తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు కూడా తమవైపు నుంచి విచారణ కొనసాగిస్తున్నారని, పూర్తి వివరాలతో లిఖితపూర్వక నివేదికను జాతీయ మహిళా కమిషన్‌కు పంపిస్తామని అధికారులు తెలిపారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరపై తప్పుడు వార్తలతో అపోహలు సృష్టించవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
